రాష్ట్ర ప్రభుత్వం నాలుగు అంశాల్లో చొరవ చూపాలని కోరుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు లేఖ రాశారు. ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు, రెమిడెసివిర్ ఇంజక్షన్లు సొంతంగా సమకూర్చడం, ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, పడకలు పెంచేలా చర్యలు తీసుకోవడంపై శ్రద్ధ చూపాలని లేఖ ద్వారా కోరారు. విశాఖలోని కేజీహెచ్, విమ్స్, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో.. వెంటిలేటర్లు, వైద్యులు ఉన్నా నిర్వహణకు నిధులు కేటాయించకపోవడం వల్ల రోగులకు సరైన సేవలు లభించడం లేదన్నారు. ఈ ఆసుపత్రులపై నిపుణులతో అధ్యయనం చేయించి.. యుద్ధప్రాతిపదికన మెరుగైన చికిత్సలు అందేలా చూడాలన్నారు.
వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు చేయాలి
ఇప్పటివరకు కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలను కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రానికి పంపిస్తోందని.. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆర్డర్లు ఇచ్చి టీకాలు తెప్పించి ప్రజలకు వాక్సినేషన్ వేసే ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆక్సిజన్ ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు.. ప్రైవేటు మెడికల్ కళాశాలలు ముందుకొస్తే ప్రభుత్వం ప్రోత్సహించాలని సూచించారు. ఆక్సిజన్ యూనిట్లు, మందులు, రెమిడెసివిర్ ఇంజక్షన్లు, టీకాలు కేంద్రం ఇస్తోందని.. రాష్ట్ర ప్రభుత్వం సైతం వీటిని సొంతంగా సేకరిస్తేనే వైద్యం అందరికీ అందుతుందని చెప్పారు.