వైకాపా ఎమ్మెల్సీ అప్పిరెడ్డి కారులో వచ్చిన పార్టీ కార్యకర్తలు తెదేపా కేంద్ర కార్యాలయంపై పోలీసుల సమక్షంలోనే దాడి చేసినట్టు స్పష్టమైన ఆధారాలున్నా ఇంతవరకు వాళ్లను ఎందుకు అరెస్టు చేయలేదని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నిప్పులు(somireddy release video of attack on tdo office) చెరిగారు. వైకాపా నాయకులు, కార్యకర్తలు తెదేపా కార్యాలయంపై దాడి చేస్తున్న దృశ్యాలను.. వారు ముఖ్యమంత్రి జగన్, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, వైకాపా నేత దేవినేని అవినాష్‌తో ఉన్న చిత్రాలు ఇవిగో అంటూ విలేకరుల సమావేశంలో వాటిని ఆయన చూపించారు. కొందరు అప్పిరెడ్డి కారులోనూ వచ్చారంటూ దానికి సంబంధించి సీసీ కెమేరాలో రికార్డయిన దృశ్యాలను చూపించారు. దాడి చేసిన అనంతరం వైకాపా వారిని ఒక డీఎస్పీ దగ్గరుండి మరీ వాహనాలు ఎక్కించి పంపిస్తున్నారంటూ ఒక వీడియో చిత్రాన్నీ ప్రదర్శించారు. ‘కళ్లకు కట్టినట్టు సీసీ కెమేరాల్లో, వీడియోల్లో రికార్డయిన దాడి దృశ్యాలు(video of attack on tdo office) రాష్ట్రవ్యాప్తంగా వైరల్ అవుతున్నా.. వాళ్లను ఎందుకు అరెస్టు చేయలేదో డీజీపీ సమాధానం చెప్పాలి’ అని ఆయన శుక్రవారం తెదేపా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో నిలదీశారు.
పోలీసులు ఇంత హీనంగా ఎందుకు మారారు?
‘‘తెదేపా కార్యాలయంపై దాడి జరుగుతున్నంతసేపూ పట్టించుకోని డీఎస్పీ.. దాడి పూర్తయిన వెంటనే వైకాపా వారి భుజాలపై చేతులు వేసి పెళ్లికొడుకుల్లా కార్లు ఎక్కించి పంపించారు. తెదేపావాళ్లు వచ్చేస్తున్నారు త్వరగా వెళ్లిపోండని సాగనంపుతున్నారు. ఎక్కండీ.. ఎక్కండీ అని అందరినీ బతిమాలుతున్నారు. ఎక్కడికి పోతోంది ఈ రాష్ట్రం? అసలు శాంతిభద్రతలు ఉన్నాయా? రాష్ట్రంలో పోలీసులు ఇంత హీనంగా ఎందుకు దిగజారారు? పోలీసు డ్రెస్సును, వారి ప్రతిష్ఠను రోడ్లపాలు చేశారు. మీరు జగన్‌తోపాటు ప్రజలకు బాధ్యులని మర్చిపోకండి. ఇంతగా దిగజారిన పోలీసు వ్యవస్థ ఏ రాష్ట్రంలోనూ లేదు. దాడి చేసినవారిని వాహనాల్లో ఎక్కించి పంపిస్తున్న వీడియోను ప్రదర్శించారు.