Offices: కొత్త జిల్లాల్లో కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలు కాకుండా... మిగిలిన శాఖల జిల్లా స్థాయి ఆఫీసులను చిన్నచిన్న భవనాల్లో సర్దుబాటు చేస్తున్నారు. కొత్త జిల్లా కేంద్రంలో ఆ శాఖకు చెందిన డివిజన్, మండల స్థాయి కార్యాలయాల్లో ఒకటి, రెండు గదులు తీసుకుని అందులోనే ప్రస్తుతానికి జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేశారు. మొత్తంగా అన్ని శాఖలు కలిపి 70 నుంచి 80 శాతం మేర ప్రభుత్వ భవనాల్లో సర్దుబాటు చేసుకోగా, మిగిలినవి అద్దె భవనాల్లో సిద్ధమయ్యాయి.
- పలు కొత్త జిల్లా కేంద్రాల్లో డివిజన్ స్థాయి కార్యాలయాలూ లేవు. దీంతో అక్కడి మండల స్థాయి కార్యాలయాల్లో జిల్లా ఆఫీసులను సిద్ధం చేశారు. ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ ఏఈ కార్యాలయాల్లో ఎస్‌ఈ కార్యాలయం, వ్యవసాయశాఖ ఏడీ కార్యాలయాల్లో జేడీ ఆఫీసు వంటివి ఏర్పాటు చేసుకున్నారు.
- అనకాపల్లి, కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం, పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో అనేక శాఖల డివిజన్ స్థాయి కార్యాలయాలూ లేవు. ఈ 3 చోట్ల ఎక్కువ శాఖలను అద్దె భవనాల్లోనూ, మండల స్థాయి కార్యాలయాల్లో సర్దుబాటు చేసుకున్నారు.
- కొత్త జిల్లాల్లో ఏయే శాఖలకు సొంత భవనాలు ఉన్నాయి? వాటి విస్తీర్ణం ఎంత? ఆ శాఖలకు ఎంత విస్తీర్ణం సరిపోతుందనే వివరాలను కలెక్టర్లు ముందుగా సేకరించారు. ఇందులో ఇతర శాఖల జిల్లా స్థాయి కార్యాలయాలను సర్దుబాటు చేశారు.
- సాధారణంగా ఓ శాఖ భవనాల్లో, ఇతరశాఖల కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు అభ్యంతరం చెబుతుంటారు. దీనిపై సీఎస్ నేతృత్వంలో అన్ని శాఖల కార్యదర్శులతో కూడిన కమిటీలో చర్చించి, అభ్యంతరాలు లేకుండా, సర్దుబాటు చేసుకునేలా ఆదేశించారు.
- జిల్లా స్థాయిలో పరిమిత సిబ్బందితో ఉండే కొన్ని శాఖలను మాత్రం... కొత్త జిల్లాల్లో ఏర్పాటు చేయడం లేదు. ఇప్పటివరకు ఉన్న పాత జిల్లా కేంద్రం నుంచే వాటినీ పర్యవేక్షించేలా ఆదేశాలిచ్చారు.
- అనకాపల్లి, భీమవరంలలో ప్రైవేటు కళాశాలల్లో కలెక్టరేట్లు ఏర్పాటు చేశారు. నరసరావుపేటలోని నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ఎస్‌ఈ కార్యాలయమే కలెక్టరేట్ అయింది. పుట్టపర్తిలో సత్యసాయి ట్రస్ట్‌కు చెందిన భవనాలను కలెక్టరేట్‌తోపాటు, వివిధ కార్యాలయాలకు ఇచ్చారు. రాయచోటిలో గత ప్రభుత్వంలో నిర్మించిన కొన్ని భవనాలు సిద్ధంగా ఉండటంతో వాటిలో కొత్త కార్యాలయాలు కొలువుదీరాయి.
మరిన్ని నిధులు కావాలి...కొత్త కార్యాలయాల కోసం ప్రభుత్వ భవనాల మరమ్మతులు, ఫర్నిచర్ కొనుగోలుకు ఒక్కో కొత్త జిల్లాకు రూ.3 కోట్లు చొప్పున గత నెలలో కేటాయించగా, అవి సరిపోలేదు. దీంతో మరిన్ని నిధులు కావాలని అధికారులు కోరుతున్నారు. ప్రతి జిల్లా నుంచి సగటున మరో రూ.పది కోట్లు చొప్పున మంజూరు చేయాలంటూ ప్రతిపాదనలు వచ్చాయి.