రాజధాని అమరావతి ప్రాంతంలో భాగమయ్యాక గన్నవరం విమానాశ్రయం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. అంతర్జాతీయ హోదా రావడం సహా 160కోట్ల రూపాయల వ్యయంతో అధునాతన దేశీయ టెర్మినల్ అందుబాటులోకి వచ్చింది. ప్రయాణికుల రాకపోకలు క్రమంగా పెరగటంతో విద్యుత్ వినియోగమూ పెరిగింది. విమానాశ్రయంలో రన్‌వే , టెర్మినల్ భవనాలు, సిగ్నలింగ్ వ్యవస్థ సహా అన్ని అవసరాలకు ఇప్పటివరకూ సాధారణ విద్యుత్‌నే వినియోగిస్తున్నారు.
గన్నవరంలో అందుబాటులోకి సౌర విద్యుత్ - సౌర
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నేటి నుంచి సౌర వెలుగులు విరజిమ్మనున్నాయి. విమానాశ్రయ అవసరాల కోసం ఏర్పాటు చేసిన సౌర విద్యుదుత్పత్తి ప్లాంట్ నేటి నుంచి అందుబాటులోకి రానుంది. ప్లాస్టిక్ నిషేధంతో గతంలో పర్యావరణ హితమైనదిగా గుర్తింపు పొందిన విజయవాడ విమానాశ్రయం....సౌర విద్యుత్ వినియోగించే తొలి విమానాశ్రయంగానూ గుర్తింపు సొంతం చేసుకోనుంది.
ఛార్జీలు తడిసి మోబడవుతున్నాయి
సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు తిరిగి 8సెకన్లలో విద్యుత్ అందించే జనరేటర్లు ఉపయోగిస్తున్నారు. ఏసీల వాడకమూ ఎక్కువే కావటంతో కరెంటు ఛార్జీలు తడిసిమోపడవుతున్నాయి. విద్యుత్ డిమాండ్‌ను అందుకోవడం సహా సౌర విద్యుత్‌ను పెద్ద ఎత్తున వినియోగిస్తూ... పర్యావరణ పరిరక్షణలో భాగం కావాలని భారత విమానయాన సంస్థ యోచించింది. తదనుగుణంగా గన్నవరం విమానాశ్రయ ప్రాంగణంలో 6 ఎకరాల స్థలంలో... ఒక మెగావాట్ విద్యుదుత్పత్తి సామర్థ్యం గల సౌర విద్యుత్ ప్లాంట్‌ను... గతేడాది డిసెంబర్‌లో ప్రారంభించారు.
నిర్మాణ పనులను అనతి కాలంలోనే పూర్తి చేసిన అధికారులు... దేశంలో వివిధ చోట్ల పనులు నిర్మాణ దశలోనే ఉండగా ఇక్కడ మాత్రం ప్లాంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ టెర్మినల్ పూర్తైతే... దేశీయ, అంతర్జాతీయ టెర్మినళ్ల విద్యుత్ అవసరాలు తీర్చేలా ప్లాంటు సామర్థ్యం పెంచుతామని అధికారులు చెబుతున్నారు.