ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా బాధితుల్లో పొగతాగే వారే అధికం - corona sufferers

కరోనా మహమ్మారిని చంపి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి? అన్న ప్రశ్నకు.. సమాధానం దొరకడం లేదని న్యూయార్క్‌లోని ప్రవాస భారతీయ ప్రముఖ వైద్యులు డాక్టర్‌ మధు కొర్రపాటి అన్నారు. నమోదవుతున్న కేసుల్లో 68 శాతం పురుషులు, 32 శాతం మంది మహిళలు ఉన్నారని తెలిపారు. మృతుల్లో అత్యధికులు పురుషులే ఉన్నారని... వైరస్‌ బారిన పడుతున్న వారిలో పొగతాగే అలవాటున్న వారే ఎక్కువని పేర్కొన్నారు.

కరోనా బాధితుల్లో పొగతాగే వారే అధికం
కరోనా బాధితుల్లో పొగతాగే వారే అధికం

By

Published : Apr 12, 2020, 7:38 AM IST

కనిపించని ఈ మహమ్మారిని చంపి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి? అన్న ప్రశ్నకు.. సమాధానం దొరకడం లేదు. న్యూయార్క్‌లో పరిస్థితి అంచనాకు అందటం లేదు. గతవారం ఒకరోజు కేసులు పెద్దగా రాకపోవటంతో ఊపిరిపీల్చుకోవచ్చు అనుకున్నాం. మరుసటి రోజు నుంచి మునుపటి కన్నా ఎక్కువ సంఖ్యలో వస్తున్నాయి’ అని న్యూయార్క్‌లోని ప్రవాస భారతీయ ప్రముఖ వైద్యులు డాక్టర్‌ మధు కొర్రపాటి చెప్పారు. చరవాణి ద్వారా ఆయన 'ఈనాడు​'తో మాట్లాడారు. నమోదవుతున్న కేసుల్లో 68 శాతం పురుషులు, 32 శాతం మంది మహిళలున్నారు. మృతుల్లో అత్యధికులు పురుషులే. వైరస్‌ బారిన పడుతున్న వారిలో పొగతాగే అలవాటున్న వారే ఎక్కువ.

పడకలకు పోటీ

అమెరికా చరిత్రలో మునుపెన్నడూ చూడనంతటి ఆరోగ్య ఆత్యయిక పరిస్థితి నెలకొంది. న్యూయార్క్‌లో జనజీవనం పూర్తిగా స్తంభించింది. నేను పనిచేస్తున్న ఆసుపత్రిలో 240 పడకలున్నాయి. అవన్నీ కరోనా బాధితులతో నిండిపోయాయి. కొంత మంది గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోతుండగా.. మరికొందరు మృత్యువుతో పోరాడుతున్నారు. ఏ కారణంతోనైనా ఒక పడక ఖాళీ అయితే దానికోసం పోటీ పడే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది.

వయసుతో సంబంధం లేదు

కరోనా వైరస్‌ బారిన పడుతున్నది వృద్ధులే అనుకుంటే పొరపాటే. మా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో 25- 30 సంవత్సరాల వారు పదుల సంఖ్యలో ఉన్నారు. వయసుతో పని లేకుండా.. రోగనిరోధక శక్తి సన్నగిల్లిన వారిలో అత్యధికులు బాధితులవుతున్నారు. వారిలో 25 శాతం మంది ఊపిరితిత్తులు, 25 శాతం మంది మూత్రపిండాలు, 25 శాతం మంది కాలేయం, మిగిలిన వారు గుండె వ్యాధులు తదితర సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వ్యాధి ప్రబలిన తొలి రోజుల్లో వైద్య పరికరాలు పూర్తి స్థాయిలో అందుబాటులో లేక కొంత ఇబ్బంది కలిగిన మాట వాస్తవమే. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు.

నర్సులకు పాదాభివందనం

వైరస్‌ బారిన పడిన వారిలో మూత్రపిండాల సమస్య ఉన్న వారికి డయాలసిస్‌ చేయాలంటే కనీసం మూడు గంటలు పడుతుంది. ఈ సమయంలో నర్సులు బాధితుడి వద్దే ఉండాలి. కొన్ని సందర్భాల్లో వైద్యుల కన్నా నర్సులే వైరస్‌ ఉన్న వ్యక్తులకు ఎక్కువ సేవలు చేయాల్సి వస్తుంది. ఈ మహమ్మారి నుంచి బయటపడిన తరవాత నర్సులకు పాదాభివందనం చేస్తాను. మహమ్మారి కారణంగా 96 శాతం మంది వైద్య సిబ్బంది, ఆరోగ్య సేవా కార్యకర్తల్లో ఆందోళన ఉన్నప్పటికీ మానవసేవే మాధవ సేవ అన్న దృక్పథంతో పని చేస్తున్నారు. వీరిని ప్రోత్సహించాల్సిన సమయమిది.

వ్యాయామం... ప్రాణాయామం

రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు వ్యాయామం తప్పనిసరి. ప్రాణాయామమూ చేయాలి. భారతదేశంలో నిబంధనలను అధిక శాతం మంది పాటిస్తున్నారు. అదే శ్రీరామరక్ష. న్యూయార్క్‌తోపాటు అమెరికాలోని కొన్ని నగరాల్లో పరిస్థితి చూస్తుంటే వీళ్లకు ప్రాణాలపై ప్రేమ లేదా? అని ఆవేదన కలుగుతోంది. భారత్‌లో ఎంత మందికి వైద్య పరీక్షలు చేస్తున్నారన్న అంశాన్ని పక్కన పెడితే లాక్‌డౌన్‌తో వైరస్‌ ఉద్ధృతికి కొంత మేరకైనా ప్రభుత్వాలు ముకుతాడు వేశాయని చెప్పవచ్చని తెలిపారు.

ఇదీ చూడండి:రాష్ట్రంలో కరోనా కేసులు 405... ఆ రెండు జిల్లాల్లోనే 157

ABOUT THE AUTHOR

...view details