శివరాత్రి పర్వదినాన... హరహర మహాదేవ, శంభోశంకర అంటూ భక్తజనం పులకించిపోయింది. ప్రధాన ఆలయాలన్నీ భక్తజన సంద్రమయ్యాయి. శ్రీశైలంలో మహాశివరాత్రి వేడుకలు అంబరాన్నంటాయి. ముందుగా స్వామి, అమ్మవార్లకు పురవీధుల్లో ప్రభోత్సవం, తర్వాత నందివాహనసేవ నిర్వహించారు. అనంతరం లింగోద్భవ మహాన్యాసరుద్రాభిషేకం చేశారు. ఆ తర్వాత పాగాలంకరణ జరిగింది. అర్థరాత్రి 12 గంటలకు భ్రమరాంబ, మల్లికార్జున స్వామి వార్ల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య, శాస్త్రోక్తంగా క్రతువును పూర్తిచేశారు. కల్యాణాన్ని చూసేందుకు భారీగా భక్తులు పోటెత్తారు. కళాకారుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
శ్రీకాళహస్తి భక్త జనసంద్రంగా మారింది. భక్తులు భారీగా తరలివచ్చి పరమేశ్వరుడిని దర్శించుకుని తరించారు. నందివాహనసేవ వైభవంగా జరిగింది. ఓం నమ:శివాయ నామస్మరణతో ఆలయం మార్మోగింది.