కొత్తూరు తాడేపల్లి గోవుల మృతి కేసు దర్యాప్తు వేగవంతం చేసేందుకు పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. డీజీపి ఆదేశాల మేరకు ఏసీపీ స్థాయి అధికారితో విజయవాడ సీపీ సిట్ ఏర్పాటు చేశారు. సీసీఎస్ ఏసీపీ శ్రీనివాసరావు ఈ బృందానికి నేతృత్వం వహించనున్నారు. సీసీఎస్ అధికారి చలపతిరావు, కొత్తపేట ఇన్స్పెక్టర్ ఉమర్, శేఖర్‌బాబు, అర్జున్, దీపిక అనే ముగ్గురు ఎస్సైలను సభ్యులుగా నియమించారు. పశుసంవర్ధక శాఖ, ఫోరెన్సిక్ అధికారులు సంయుక్తంగా ఈ కేసు దర్యాప్తు చేయనున్నారు.
గోవుల మృతిపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే శవపరీక్ష, ఫోరెన్సిక్ నివేదికలే ఈ కేసులో కీలకంగా మారనున్నాయి. పశుగ్రాసంపై ఉన్న రసాయనాల అవశేషాలే ఆవుల మృతికి కారణమని ప్రాథమిక నిర్ధారణలో తేలినట్లు పశుసంవర్ధక శాఖ అధికారులు తెలిపారు. విషప్రయోగమా... కాదా అనే విషయంపై ఫోరెన్సిక్ నివేదికలో స్పష్టమవుతుందని చెప్పారు. భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ గోశాలను పరిశీలించారు. గోవుల మృతి కుట్ర పూరితంగానే జరిగిందని ఆరోపించారు. పోలీసులు దర్యాప్తులో నిష్పక్షపాతంగ వ్యవహరించాలని కోరారు.