విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు వైభవంగా సాగుతున్నాయి. మూడో రోజున అమ్మవారు గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. జగన్మాతను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. కరోనా నిబంధనల మేరకు పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తున్నారు.
గాయత్రీమాతను వేదమాతగా కొలుస్తూ... దర్శించడం వల్ల సకల మంత్రసిద్ధి ఫలాన్ని పొందుతారని భక్తుల విశ్వాసం. మూడోరోజున విశిష్ఠత దృష్ట్యా ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన కేరళ సంగీత విభావరి భక్తులను ఆకట్టుకుంది. అమ్మవారిని దర్శించుకోవడం ఆనందాన్నిచ్చిందని భక్తులు తెలిపారు.