తెలంగాణ ఏర్పడిన దగ్గరి నుంచి రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖపై ప్రత్యేక దృష్టిపెట్టింది. అత్యుత్తమ సేవలు అందించేందుకు వీలుగా సకల సౌకర్యాలు కల్పించింది. కొందరు అధికారులపై అవినీతి ఆరోపణలు, ఫిర్యాదు చేసేందుకు వస్తున్న మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం, బాధితుల సమస్యలను ఆసరాగా చేసుకొని ఇబ్బందులకు గురిచేయడం.. మొత్తం శాఖకు చెడ్డపేరు తీసుకొస్తుంది.
ఇదే తరహాలో ఇటీవల కాలంలో ముగ్గురు పోలీస్ అధికారులు సస్పెండ్ అయ్యారు. ఇందులో ఒక ఏసీపీ, ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఉన్నారు.
వనస్థలిపురం ఏసీపీ..
తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఓ మహిళ.. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని వనస్థలిపురం ఏసీపీ జైరాంరెడ్డిపై ఫిర్యాదు చేసింది. ఫలితంగా సదరు అధికారి సస్పెండ్ అయ్యారు. గతంలో పెద్ద అంబర్‌పేట అవుటర్ రింగ్ రోడ్ సమీపంలోని ఓ భూమికి సంబంధించి నకిలి పత్రాలు తయారుచేసి కబ్జాదారునికి అండగా నిలిచారంటూ జైరాంరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి.
ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్..
ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్గా ఉన్న మురళీకృష్ణ.. గతంలో వనస్థలిపురం ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న సమయంలో ఓ మహిళ కేసును దర్యాప్తు చేశారు. అనంతరం అక్కడ నుంచి బదిలీ అయ్యారు. ఆ కేసు పరిష్కరిస్తున్న సమయంలో తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ సదరు మహిళ రాచకొండ సీపీ మహేశ్ భగవత్‌కు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన రాచకొండ సీపీ.. డీజీపీ నివేదిక పంపారు. ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్పై హైదరాబాద్ సీపీ అంజనీకుమార్‌కు కూడా వివరాలు పంపారు. స్పందించిన సీపీ అతన్ని సస్పెండ్ చేశారు. ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్గా నర్సింహారెడ్డి బాధ్యతలు చేపట్టారు.
సీఐపై నిర్భయ కేసు..
హైదరాబాద్ కమిషనరేట్‌లో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న చంద్రకుమార్‌పై వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌లో నిర్భయ సెక్షన్ 354డి కింద కేసు నమోదయ్యింది. తనకు అసభ్య సందేశాలు పంపుతూ.. ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఈ కేసులో సీఐ చందర్‌ను.. సీపీ అంజనీకుమార్ సస్పెండ్ చేశారు. పోలీస్ శాఖలో ఇలాంటి చర్యలు సహించేదిలేదని హెచ్చరించారు.
ఫ్రెండ్లీ పోలీస్ పేరిట.. పోలీసులను ప్రజలకు దగ్గర చేయాలని ఉన్నతాధికారులు ఎంత ప్రయత్నిస్తున్నా.. అక్కడక్కడా ఇలాంటి అధికారుల ప్రవర్తన ఏకంగా పోలీస్ శాఖకే చెడ్డపేరు తీసుకువస్తోంది.