Secunderabad riots case update: అగ్నిపథ్ ప్రకటనకు నిరసనగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జూన్ 17న జరిగిన విధ్వంసం కేసులో సూత్రధారిగా వ్యవహరించిన ఆవుల సుబ్బారావు అరెస్టుపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు ఈ కేసులో ఏడుగురు నిందితులను ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం రైల్వే పోలీసులకు అప్పగించారు. ఈ ఏడుగురూ సుబ్బారావు అనుచరులేనని రైల్వే పోలీసులు ఆధారాలు సేకరించారు.
అంతకుముందు సుబ్బారావుతో సహా ఎనిమిది మందిని గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించి రైల్వే పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తాజాగా ఆదుపులోకి తీసుకున్న వారిని కూడా విచారించిన తర్వాత సుబ్బారావును న్యాయస్థానంలో హాజరుపరిచేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.