High Court New Judges: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా అడుసుమల్లి వెంకట రవీంద్రబాబు, డాక్టర్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్, బండారు శ్యాంసుందర్, ఊటుకూరు శ్రీనివాస్, బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి, తల్లాప్రగడ మల్లికార్జునరావు, దుప్పల వెంకటరమణ ప్రమాణం చేశారు. మొదటి నలుగురు న్యాయమూర్తులుగా, మిగిలిన ముగ్గురు అదనపు న్యాయమూర్తులుగా ప్రమాణం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గురువారం ఉదయం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వీరితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు, కొత్త జడ్జీల కుటుంబ సభ్యులు, సతీమణులు, హైకోర్టు రిజిస్ట్రార్లు, న్యాయవాదులు, ఏజీ శ్రీరామ్, బార్ కౌన్సిల్ ఛైర్మన్ గంటా రామారావు, హైకోర్టు న్యాయవాదుల సంఘం కార్యవర్గం, కోర్టు సిబ్బంది హాజరు అయ్యారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన న్యాయమూర్తులకు పలువురు న్యాయవాదులు, బంధువులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు. ప్రమాణ స్వీకారం అనంతరం కొత్త న్యాయమూర్తులు హైకోర్టుకు చేరుకుని కేసులను విచారించారు. రాష్ట్ర హైకోర్టులో ఏడు ధర్మాసనాలు ఏర్పాటు చేయడం ఇది రెండోసారి.
* ఏపీ హైకోర్టుకు ఆమోదిత మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 37 (28 శాశ్వత, 9 అదనపు) కాగా.. కొత్తగా నియమితులైన ఏడుగురితో న్యాయమూర్తుల సంఖ్య 31కి చేరింది.
కొత్త న్యాయమూర్తుల నేపథ్యం..
జస్టిస్ అడుసుమల్లి వెంకట (ఏవీ) రవీంద్రబాబుది ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి మండలం తిమ్మాయపాలెం స్వగ్రామం. తల్లిదండ్రులు రాఘవరావు, సీతారావమ్మ. 1988లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. 1994లో జ్యుడీషియల్ సర్వీసులోకి వచ్చారు. 2005లో సీనియర్ సివిల్ జడ్జిగా, 2012లో జిల్లా జడ్జిగా పదోన్నతి పొందారు. విశాఖలోని అనిశా కోర్టు ప్రత్యేక న్యాయాధికారిగా పనిచేశారు. రాజమహేంద్రవరం, విజయవాడ, నెల్లూరు, చిత్తూరు, గుంటూరు జిల్లాలో వివిధ హోదాల్లో న్యాయాధికారిగా సేవలు అందించారు. పీడీజేగా పనిచేశారు. 2021 డిసెంబరు నుంచి ఏపీ హైకోర్టులో రిజిస్ట్రార్ జనరల్‌గా సేవలు అందించారు.
జస్టిస్ వక్కలగడ్డ రాధా కృష్ణ కృపాసాగర్.. వీబీకే విఠల్, పుష్పవతి దంపతులకు 1963లో జన్మించారు. నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌ఎం, న్యాయశాస్త్రంలో పీహెచ్‌డీ చేశారు. 1994లో జూనియర్ సివిల్ జడ్జిగా నియమితులయ్యారు. సినియర్ సివిల్ జడ్జిగా, జిల్లా జడ్జిగా న్యాయసేవలు అందించారు. లా జర్నల్స్‌కు పలు వ్యాసాలు రాశారు. ఏపీ జ్యుడీషియల్ అకాడమీలో న్యాయాధికారులకు సీనియర్ ఫ్యాకల్టీగా పనిచేశారు. ఏపీ న్యాయసేవాధికార సంస్థకు సభ్య కార్యదర్శిగా సేవలు అందించారు. కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి (పీడీజే)గా పనిచేశారు. ఆయన సతీమణి సత్యవతి అదనపు జిల్లా జడ్జిగా కర్నూలులో పనిచేస్తున్నారు.
జస్టిస్ బండారు శ్యాంసుందర్ తల్లిదండ్రులు సుబ్బలక్ష్మి, సుబ్రహ్మణ్యం. 1962లో అనంతపురంలో జన్మించారు. తాత బండారు రంగనాథం ప్రముఖ న్యాయవాది. శ్యాంసుందర్ 1986లో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. అదే ఏడాది న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. ఐదేళ్లు అనంతపురంలో ప్రాక్టీసు చేశారు. మున్సిఫ్ మెజిస్ట్రేట్‌గా 1991లో జ్యుడీషియల్ సర్వీసులోకి ప్రవేశించారు. సీనియర్ సివిల్ జడ్జిగా, అదనపు జిల్లా జడ్జిగా న్యాయసేవలు అందించారు. న్యాయాధికారిగా 30 ఏళ్లు అనుభవం గడించారు. విజయవాడలో మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా పనిచేశారు.
జస్టిస్ ఊటుకూరు శ్రీనివాస్ ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జన్మించారు. తండ్రి లక్ష్మణరావు, తల్లి లీలావతి, భార్య లక్ష్మీప్రసన్న. గుంటూరు మున్సిపల్ హైస్కూల్, తిరువూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మచిలీపట్నం డీఎస్‌ఆర్ హిందూ న్యాయ కళాశాలలో చదివారు. న్యాయాధికారిగా 1994 మేలో మొదటి పోస్టింగ్ తీసుకున్నారు. గుంటూరు, విశాఖపట్నం, ఒంగోలు, హైదరాబాద్, కర్నూలులో న్యాయసేవలు అందించారు. కాకినాడలోని మూడో అదనపు జిల్లా జడ్జిగా పనిచేశారు.
జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తితూర్పుగోదావరి జిల్లా కందులపాలెంలో జన్మించారు. తండ్రి డాక్టర్ బి.పాపారాయ చౌదరి, తల్లి విజయలక్ష్మి. 1988లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. కాకినాడ బార్‌లో ప్రాక్టీసు చేశారు. 1994లో డిస్ట్రిక్ట్ మున్సిఫ్ మెజిస్ట్రేట్‌గా జ్యుడీషియల్ సర్వీసులో చేరారు. 2005లో సీనియర్ సివిల్ జడ్జిగా పదోన్నతి పొందారు. సత్యం కంప్యూటర్స్ కేసును ప్రత్యేక జడ్జిగా విచారణ చేశారు. 2015లో జిల్లా జడ్జిగా పదోన్నతి పొందారు. హైదరాబాద్ సీబీఐ కోర్టు జడ్జిగా పనిచేశారు. 2019లో విజయవాడ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా న్యాయసేవలు అందించారు. 2020 నుంచి హైకోర్టు రిజిస్ట్రార్ (ఐటీ-సీపీసీ)గా పనిచేశారు.
జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు..శ్రీరామచంద్రమూర్తి, రమణ దంపతులకు 1964 జనవరి 19న కోనసీమ జిల్లా పుల్లేటికుర్రులో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. అయినవిల్లి మండలం నేదునూరు స్వస్థలం. పదో తరగతి వరకు నేదునూరులో, బీఎస్సీ అమలాపురంలో అభ్యసించారు. రాజమహేంద్రవరంలోని జీఎస్‌కేఎం న్యాయకళాశాలలో న్యాయశాస్త్రం చదివారు. ప్రస్తుత బాపట్ల జిల్లా పర్చూరులో 1994లో అదనపు డిస్ట్రిక్ట్ మున్సిఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. ధర్మవరం, అనకాపల్లి, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో న్యాయసేవలు అందించారు. 2006లో సీనియర్ సివిల్ జడ్జిగా, 2015లో జిల్లా జడ్జిగా పదోన్నతి పొంది మచిలీపట్నం, ఏలూరులో న్యాయసేవలు అందించారు. నూజివీడులో అదనపు జిల్లా జడ్జిగా పనిచేశారు.
జస్టిస్ దుప్పల వెంకటరమణ1963 జూన్ 3న వరహాలమ్మ, అప్పన్న దంపతులకు శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం చిన్న బొడ్డేపల్లిలో జన్మించారు. తండ్రి రైల్వే గ్యాంగ్‌మన్‌గా పనిచేశారు. విధినిర్వహణలో ఉండగా 1976లో ఆయన కన్నుమూశారు. దీంతో వెంకటరమణ అన్న వెంకటసత్యం చదువు చెప్పించారు. ప్రాథమిక విద్య బొడ్డేపల్లి, తోటాడ గ్రామాల్లో జరిగింది. విజయనగరం మహారాజ కళాశాలలో బీఏ చేశారు. విశాఖలోని ఎన్‌వీపీ న్యాయకళాశాలలో న్యాయశాస్త్రం చదివారు. 1989లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, తదితర కోర్టుల్లో ప్రాక్టీసు చేశారు. 1994 మే 4న మున్సిఫ్ మెజిస్ట్రేట్‌గా జ్యుడీషియల్ సర్వీసులో చేరారు. 2007లో సీనియర్ సివిల్ జడ్జిగా, తర్వాత డిస్ట్రిక్ట్, సెషన్స్ జడ్జిగా పదోన్నతి పొందారు. కాకినాడ, గురజాలలో న్యాయసేవలు అందించారు. తితిదే లా ఆఫీసర్‌గా 2015 నుంచి 2017 వరకు పనిచేశారు. 2017 నుంచి 2019 వరకు ఏపీ న్యాయశాఖ కార్యదర్శిగా సేవలు అందించారు. హైకోర్టు రిజిస్ట్రార్‌గా (నియామకాలు), 2020 ఫిబ్రవరి నుంచి రిజిస్ట్రార్‌గా (పరిపాలన) పనిచేశారు.
ఇవీ చూడండి :