RTC: ఆర్టీసీ మనుగడ కోసమే సెస్ పెంచినట్లు.. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. డీజిల్ ధర 2019తో పోల్చితే లీటరుకు రూ.42 పెరగడంతో ఆర్టీసీకి ఏటా రూ.1300 కోట్ల నష్టం వస్తోందన్నారు. ఆర్టీసీ ప్రస్తుతం రూ.3,900 కోట్లు నష్టాల్లో ఉందని వివరించారు. వీటి నుంచి గట్టెక్కేందుకు డీజిల్ సెస్‌ను పెంచామన్నారు.
రాష్ట్రంలో వరదల వల్ల దెబ్బతిన్న రహదారులను 8 వేల కి.మీల మేర మరమ్మతులు చేయించామని, ఇందుకు రూ.2,500 కోట్లు వెచ్చించామని కృష్ణబాబు చెప్పారు. మే నెలకల్లా అన్ని రకాల పనులు పూర్తి చేస్తామన్నారు. నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పనులు లేకపోతే సంబంధిత అధికారులు, గుత్తేదార్లపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఉద్యోగులకు రూ.1,254 కోట్ల బకాయిలు చెల్లించాం..ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమయ్యాక జీతాలు ప్రభుత్వం ఇస్తుండటంతో.. సంస్థ రాబడితో బకాయిలు తీరుస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది. ఉద్యోగులకు సంబంధించి పీఎఫ్ ట్రస్ట్ బకాయిలు రూ.725 కోట్లు, క్రెడిట్ కోఆపరేటివ్ సంఘానికి రూ.269 కోట్లు, ఎస్‌బీటీ, ఎస్‌ఆర్‌బీఎస్‌కు రూ.260 కోట్లు కలిపి మొత్తం రూ.1,254 కోట్లు చెల్లించినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.