ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన ఏబీ వెంకటేశ్వరరావు - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

IPS ABV హైకోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం అమలు చేయడం లేదని సీనియర్ ఐపీఎస్​ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని ఇప్పటికే రెండు సార్లు సీఎస్​కు లేఖలు రాసినట్లు ఏబీవీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

SENIOR IPS ABV
SENIOR IPS ABV

By

Published : Aug 18, 2022, 5:40 PM IST

SENIOR IPS ABV సస్పెన్షన్ కాలంలో పూర్తి జీతం, అలవెన్స్‌లు ఇవ్వాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా.. ప్రభుత్వం అమలు చేయడం లేదని సీనియర్ ఐపీఎస్​ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం విచారణ జరపగా.. కోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని ఇప్పటికే రెండు సార్లు సీఎస్​కు లేఖలు రాసినట్లు ఏబీవీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 22 నుంచి మాత్రమే పూర్తి జీతం ఇచ్చారని.. పాత బకాయిలు చెల్లించలేదని వివరించారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను సెప్టెంబర్ కు 15కు వాయిదా వేసింది.

ఇదీ జరిగింది: సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సస్పెండ్‌ చేసింది. నిఘా విభాగం చీఫ్‌గా పని చేసిన సమయంలో భద్రత పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆ కేసులో విచారణను ఎదుర్కొంటున్న ఆయన సాక్షుల్ని ప్రభావితం చేసేందుకు యత్నించారన్న అభియోగంపై తాజాగా సస్పెండ్‌ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ(JUNE 28) ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

ఏబీ వెంకటేశ్వరరావుపై తీవ్ర అవినీతి అభియోగాలున్నాయని, ఇప్పటికే ఆయన్ని సర్వీసు నుంచి డిస్మిస్‌ చేయడానికి సిఫార్సు చేశామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అఖిల భారత సర్వీసు అధికారులపై ఉండే క్రిమినల్‌ అభియోగాలన్నీ తొలగిపోయేంతవరకు లేదా కొట్టేసేంతవరకు వారిపై సస్పెన్షన్‌ విధించే విచక్షాణాధికారం ప్రభుత్వానికి ఉందని అందులో పొందుపరిచారు. ఈ మేరకు అఖిల భారత సర్వీసు నియమావళి ప్రకారం... ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ కమిషనర్‌గా పోస్టింగు ఇచ్చామని, ఆ తర్వాత ఆయన తాను ఎదుర్కొంటున్న నేర విచారణకు సంబంధించిన వ్యవహారంలో సాక్షుల్ని ప్రభావితం చేసేందుకు ప్రయత్నించినట్లు గుర్తించామన్నారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని, సస్పెన్షన్‌ అమల్లో ఉన్న కాలంలో ఆయన, విజయవాడను విడిచిపెట్టి వెళ్లడానికి వీల్లేదని ఉత్తర్వుల్లో ప్రస్తావించారు.

వైకాపా అధికారం చేపట్టిన వెంటనే 2019 మే 30న ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావును ప్రభుత్వం బదిలీ చేసింది. పోస్టింగు ఇవ్వలేదు. ఆ తర్వాత భద్రత పరికరాల కొనుగోలు వ్యవహారంలో అవకతవకలకు పాల్పడ్డారన్న అభియోగాలు మోపి.. 2020 ఫిబ్రవరి 8న సస్పెండ్‌ చేసింది. తన సస్పెన్షన్‌ అక్రమం అంటూ ఆయన హైకోర్టును, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చివరికి సుప్రీం ఆదేశాల మేరకు ఈ ఏడాది మే 18న ఆయనను విధుల్లోకి తీసుకుంది. సుప్రీం ఆదేశాల మేరకు తనకు పోస్టింగు ఇవ్వాలని పలుమార్లు సీఎస్‌కు వినతిపత్రాలుఇచ్చాక జూన్‌ 14న ఆయన్ని ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ కమిషనర్‌గా నియమించింది. బాధ్యతలు చేపట్టి 15 రోజులైనా గడవకముందే మరోమారు ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details