తెలంగాణలోని భద్రాచలం శ్రీరాముడి దివ్యక్షేత్రంలో ఏటా వైభవోపేతంగా సాగే శ్రీరామనవమి వేడుకల్లో ఒక్కో ఘట్టానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. సీతారాముల కల్యాణం, పట్టాభిషేక మహోత్సవాలకు అత్యంత ప్రాముఖ్యం ఉంది. ఏటా అత్యంత వైభవంగా సాగే ఈ వేడుకల కోసం తెలుగు ప్రాంతాల నుంచే కాకుండా... వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివస్తారు. నిత్య కల్యాణంలో పసుపురంగు తలంబ్రాలను ఉపయోగించడం ఓ ఎత్తైతే...రాములవారి వార్షిక కల్యాణ వేడుకలో మాత్రం ఎరుపురంగు తలంబ్రాలను ఉపయోగించడం ఆనవాయితీ. ఆ తలంబ్రాలు తమ దోసిట పడటాన్ని భక్తులు మహద్భాగ్యంగా భావిస్తారు. అంతటి ప్రాశస్త్యం ఉన్న భద్రాద్రి రాములవారి తలంబ్రాలు... ఆలయ అధికారులు నిలువెత్తు నిర్లక్ష్యంతో నేలపాలయ్యాయి. ఆలయ ఈవో నుంచి మొదలుకొని ఏఈవో, ఇతర అధికారులు, సిబ్బంది అంతా దగ్గరుండి మరీ 20 అడుగుల లోతైన గోతిలో పాతిపెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
గుట్టుచప్పుడు కాకుండా
అసలు విషయానికి వస్తే.. గతేడాది ఏప్రిల్లో జరిగిన శ్రీరామనవమి ఉత్సవాల కోసం ఆలయ అధికారులు.. భారీగా తలంబ్రాలు తయారు చేయించారు. కొవిడ్ ప్రభావంతో సీతారాముల కల్యాణానికి భక్తులకు అనుమతి ఇవ్వలేదు. కేవలం ప్రముఖులు, వైదిక పెద్దల సమక్షంలోనే కల్యాణఘట్టం నిర్వహించారు. దీంతో భారీగా తలంబ్రాలు మిగిలిపోయాయి. కరోనా నిబంధనలు సడలించాక తలంబ్రాలను భక్తులకు పంచిపెట్టాల్సి ఉన్నా...ఆలయ అధికారులు పట్టించుకోలేదు. దాదాపు ఏడాది పాటు ఓ గదిలో నిల్వచేసే సరికి తలంబ్రాల నాణ్యత దెబ్బతింది. వాసన రావడం, పురుగులు పట్టి పాడయ్యాయి. దీనిని గమనించిన ఆలయ అధికారులు.. గుట్టుచప్పుడు కాకుండా వాటిని అక్కడి నుంచి తరలించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తమపట్నంలోని గోశాలలో 20 అడుగుల గోతి తవ్వి అందులో తలంబ్రాలను పారబోశారు. నిత్యం చెత్త తరలించే వాహనాల్లో పవిత్రమైన తలంబ్రాలను తీసుకెళ్లి.. జేసీబీలతో గొయ్యి తీసి అందులో పడేశారు. అధికారులు, సిబ్బంది, వైదిక పెద్దలు అంతా ఈ తతంగానికి ప్రత్యక్షసాక్ష్యంగా నిలిచారు.