కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకుని వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించాలని కోరుతూ సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించింది. ఈ మేరకు ఉద్యోగ సంఘం నేతలు సచివాలయ మొదటి బ్లాక్‌లోని సీఎస్ కార్యాలయంలో విజ్ఞాపన పత్రాన్ని అందించి తక్షణమే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరోనా కారణంగా నలుగురు సచివాలయ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారని, గత ఏడాది ఇద్దరు ఉద్యోగులు మృతి చెందినట్టు సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి నాప ప్రసాద్ వెల్లడించారు. సచివాలయ ఉద్యోగులమైన తామంతా ఈ పరిస్థితిని చూసి భయపడుతున్నామని స్పష్టం చేశారు.
సచివాలయ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వాలి.. ప్రభుత్వానికి లేఖ
ప్రభుత్వానికి సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలు లేఖ రాశారు. సచివాలయం ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం 40 నుంచి 50 మంది ఉద్యోగులు కరోనా కారణంగా హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారని నాప ప్రసాద్ తెలిపారు. వర్క్ ఫ్రం హోంకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్టు వెల్లడించారు. దూర ప్రాంతాల నుంచి విధులు నిర్వహించేందుకు సచివాలయానికి వస్తున్న తమకు ఎలాంటి లక్షణాలు కన్పించకుండానే కొవిడ్ సోకుతోందని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. మరో ఉద్యోగి ప్రాణాలు కోల్పోకుండా వర్క్ ఫ్రమ్ హోం వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేశారు. కొవిడ్ సోకిన ఉద్యోగులు ఎక్కడికి వెళ్లాలో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొందని ఉద్యోగులు వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి:కరోనాతో మరో ఇద్దరు సచివాలయ ఉద్యోగులు మృతి