Venkatrami Reddy On PRC: పీఆర్సీపై అతి త్వరలోనే ప్రభుత్వం ప్రకటన చేస్తుందని.. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి చెప్పారు. పీఆర్సీపై అధికారుల ప్రతిపాదనలను.. సీఎం ఆమోదించారని తెలిపారు. 3, 4 రోజుల్లో పీఆర్సీపై ప్రకటిస్తారని ఆశిస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపిందన్నారు. ఆందోళన చేస్తున్న ఉద్యోగ సంఘాలపై మండిపడ్డ వెంకట్రామిరెడ్డి.. పీఆర్సీ కోసం 10 రోజులు ఆగలేరా ? అని ప్రశ్నించారు. మార్కెటింగ్‌శాఖ ఉద్యోగులు 010 పద్దు కింద వేతనాలు కోరుతున్నారన్న వెంకట్రామిరెడ్డి.. అందుకు సీఎం అంగీకారం తెలిపినట్లు వెల్లడించారు.
ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో సీఎం భేటీ..
CM Jagan on PRC : పీఆర్సీపై ఉద్యోగులు ఆందోళన చేస్తున్న వేళ.. ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో ఇవాళ సీఎం వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఉద్యోగుల వేతన సవరణపై కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించిన సీఎం.. ఎంత మేర వేతనాలు పెంచితే బాగుంటుందనే అంశంపై అభిప్రాయాలు సేకరించినట్టు సమాచారం. ఉద్యోగుల ఇతర సమస్యలపైనా చర్చించినట్టు తెలుస్తోంది.