ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా భయం.. కారుతోనే అభయమంటూ.. - ఏపీలో పెరిగిన కార్ల కొనుగోళ్లు న్యూస్

లాక్‌డౌన్‌ అనంతరం ప్రజలు ప్రజా రవాణాను వినియోగించుకునేందుకు జంకుతున్నారు. ఆర్థికంగా కాస్త ఇబ్బందులున్నా.. కొంత కాలంగా కారు కొనాలనే ఆలోచనలో ఉండి.. వాయిదా వేస్తూ వస్తున్నవారు ప్రస్తుతం కరోనా భయంతో సొంత కారువైపు మొగ్గుతున్నారు. కొత్త కారుకు పెట్టే ఖర్చుతో పోలిస్తే చాలా తక్కువ ధరకే పాత (సెకండ్‌ హ్యాండ్‌) కార్లు మార్కెట్‌లో అందుబాటులో ఉండటంతో వాటిని కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. వీటికి ఫైనాన్స్‌ సౌకర్యం కల్పించేందుకూ పలు సంస్థలు ముందుకొస్తున్నాయి. లాక్‌డౌన్‌ మినహాయింపుల తరువాత సెకండ్‌ హ్యాండ్‌ కార్ల విక్రయాలు ఆశాజనకంగా ఉన్నట్లు ఈ వ్యాపారంలో ఉన్న పలువురు చెబుతున్నారు.

second hand cars sales increasing in andhrapradesh because of corona
second hand cars sales increasing in andhrapradesh because of corona

By

Published : Jul 12, 2020, 7:09 AM IST

హ్యాచ్‌బ్యాక్‌ కారు నుంచి సెడాన్‌కు..

బైక్‌ నుంచి కారుకు..

హ్యాచ్‌బ్యాక్‌ కార్లు రూ.5 లక్షల బడ్జెట్‌లో లభిస్తాయి. అదే ధరకు సెకండ్‌ హ్యాండ్‌ మార్కెట్‌లో సెడాన్‌ కార్లు వచ్చేస్తుండటంతో ఎగువ మధ్యతరగతి వారు ఎక్కువగా వాటివైపు మొగ్గు చూపుతున్నారు. అలాగే...రూ.లక్ష లోపే చిన్న కార్లు దొరుకుతుండటంతో మధ్యతరగతి కుటుంబాలు ద్విచక్రవాహనాలకు బదులు సొంత కారు కలను సాకారం చేసుకుంటున్నారు. కరోనా ముందు కంటే ఇప్పుడు 30 నుంచి 40 శాతం వరకూ వ్యాపారం పెరిగిందని.. రూ.2 లక్షల నుంచి రూ.5లక్షల లోపు బడ్జెట్‌ ఉండే వాహనాలకు ఎక్కువ డిమాండు ఉందని పాతకార్ల విక్రయదార్లు అంటున్నారు. ప్రస్తుతం పెట్రోలు, డీజిల్‌ ధరల మధ్య పెద్దగా వ్యత్యాసం లేకపోవడంతో.. పెట్రోలు కార్లవైపే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు.

ఇవి చూసుకోవడం తప్పనిసరి...

సెకండ్‌ హ్యాండ్‌ కార్లు కొనేటప్పుడు.. ఆర్‌టీవో విచారణ ద్వారా, మెకానిక్‌ దగ్గరకు తీసుకెళ్లి.. తయారీ సంవత్సరం, ఎన్ని కిలోమీటర్లు తిరిగింది, ఎన్ని చేతులు మారింది, సర్వీస్‌ ట్రాక్‌ ఏమిటి, ఏవైనా ప్రమాదాలకు గురైందా, ఛాసిస్‌ లోపం ఉందా, ఇంజిన్‌ రీబోర్‌ చేశారా, టింకరింగ్‌, పెయింటింగ్‌ ఎన్నిసార్లు చేశారు, ఎన్నిమార్లు ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ చేశారు...తదితర వివరాలన్నీ క్షుణ్నంగా తెలుసుకున్నాకే కొనుగోలు చేయడం మంచిదని ఈ వ్యాపారంలో ఉన్న ఉదయ్‌ తెలిపారు.

ఆశాజనకంగా ఉంది

ప్రస్తుతం వచ్చే కార్లన్నీ బీఎస్‌ 6 వాహనాలు కావడం.. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న బీఎస్‌4 వాహనాల కంటే వాటి ధర 20శాతం అధికంగా ఉండటంతో అందుబాటులో ఉన్న సెకండ్‌ హ్యాండ్‌ కార్ల కొనుగోలే ఉత్తమం అనే ఆలోచన ప్రజల్లో ఉంది. ప్రస్తుతం వ్యాపారం ఆశాజనకంగా ఉంది.

- శ్రీకాంత్‌, వెంకటేశ్‌, సెకండ్‌ హ్యాండ్‌ కార్ల వ్యాపారులు

ఎప్పటి నుంచో కొందామనుకుంటున్నా

ఎప్పటి నుంచో కారు కొందామనుకుంటున్నా. కరోనా తర్వాత కారు తప్పనిసరి అని భావిస్తున్నా. కుటుంబంతో కలిసి ప్రయాణించే వెసులుబాటు, సురక్షిత ప్రయాణాన్ని దృష్టిలో ఉంచుకుని కాస్త భారమైనా బడ్జెట్‌లోని సెకండ్‌ హ్యాండ్‌ కారు కొనాలని నిర్ణయించుకున్నా.

- అరవింద్‌, విజయవాడ

ABOUT THE AUTHOR

...view details