ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఉజ్జయిని మహంకాళి అమ్మవారు భవిష్యవాణిలో ఏం చెప్పారో తెలుసా? - తెలంగాణ తాజా వార్తలు

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల వేడుక పరిసమాప్తమైంది. విశేష పూజలందుకున్న అమ్మవారు.. రంగం కార్యక్రమంలో భాగంగా జోగిని స్వర్ణలతను ఆవహించి భవిష్యవాణి వినిపించారు. రానున్న రోజుల్లో ప్రజలకు మరిన్ని ఇబ్బందులు తప్పవని... ఎవరు చేసింది వారు అనుభవించాల్సిందేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు తాను ఉన్నానంటూ భరోసా ఇచ్చారు.

ఉజ్జయిని మహంకాళి అమ్మవారు భవిష్యవాణిలో ఏం చెప్పారో తెలుసా?
ఉజ్జయిని మహంకాళి అమ్మవారు భవిష్యవాణిలో ఏం చెప్పారో తెలుసా?

By

Published : Jul 14, 2020, 12:54 AM IST

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న వేళ అందరి చూపు సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో నిర్వహించిన రంగంపై పడింది. భవిష్యవాణిలో స్వర్ణలత ఏం చెబుతారో తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపారు. ఏటా వానలు ఎలా పడతాయి..? పంటలు ఎలా పండుతాయనే అంశాలపై భవిష్యవాణిలో అమ్మవారిని ప్రశ్నలడిగేవారు. ఈసారి మాత్రం కొవిడ్‌ ప్రభావంపై సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

కరోనాపై ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని.. ఎవరు చేసింది వారు అనుభవించక తప్పదని స్వర్ణలత భవిష్యవాణిలో పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయని... ప్రజలందరినీ కాపాడుకుంటానని అమ్మవారు అభయమిచ్చారు. ఈర్ష్య, కామ, ద్వేషాలు వదిలి.. తనను ఐదు వారాలపాటు సాకతో కొలవాలని సూచించారు. గంగాదేవి యజ్ఞహోమాలు జరిపితే సిరిసంపదలు కలుగుతాయని తెలిపారు.

అంతకుముందు మహంకాళి అమ్మవారికి అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వైరస్‌ వ్యాప్తి కారణంగా భక్తులను అనుమతించకపోవడం వల్ల.... ఎవరిళ్లలో వారు బోనాలు సమర్పించుకున్నారు. అమ్మవారి ఘటాలను మొదటిసారిగా భక్తులు లేకుండానే ఆయా ఆలయాల్లో శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. రంగం అనంతరం ఫలహార బండ్ల ఊరేగింపు కన్నులపండువగా సాగింది. అమ్మవారి చిత్రప‌టాన్ని ప్రత్యేకంగా అలంక‌రించిన ఏనుగుపై ఉంచి మంగ‌ళ‌వాద్యాలు, క‌ళాకారులు, ఆట‌పాట‌ల‌తో ఘనంగా ఊరేగించారు. వేడుకల్లో భాగంగా పోతురాజుల విన్యాసం ప్రత్యేక ఆక‌ర్షణ‌గా నిలిచింది.

ఏటా వేలాది మంది భక్తుల కోలాహలం నడుమ అత్యంత వైభవోపేతంగా జరిగే ఉత్సవాలు... కరోనా కారణంగా ఈసారి బోసిపోయాయి. భక్తులు లేకుండా అమ్మవారి వేడుకలు జరపడం చరిత్రలోనే మొదటిసారిగా ఆలయ ప్రతినిధులు చెబుతున్నారు.

ఉజ్జయిని మహంకాళి అమ్మవారు భవిష్యవాణిలో ఏం చెప్పారో తెలుసా?

ఇదీ చూడండి:కరోనాపై పోరు: 2021 నాటికైనా వ్యాక్సిన్‌ వచ్చేనా?

ABOUT THE AUTHOR

...view details