ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎస్​ఈసీ ఆదేశాల అమలు నిలిపివేయండి : మంత్రి కొడాలి నాని - మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేయండి : ఎస్ఈసీ నిమ్మగడ్డ

ఎస్​ఈసీ, కమిషనర్ నిమ్మగడ్డ​పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు మంత్రి కొడాలి నానిపై చర్యలకు రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు మంత్రిపై కేసు నమోదు చేయాల్సిందిగా కృష్ణా జిల్లా ఎస్పీని ఆదేశించింది. కమిషనర్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ నాని.. శనివారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను హరించేలా కమిషనర్ ఉత్తర్వులున్నాయని, వాటి అమలును నిలుపుదల చేస్తూ మధ్యంతర ఆదేశాలివ్వాలని కోరారు.

ఎస్​ఈసీ ఆదేశాల అమలు నిలిపివేయండి : మంత్రి కొడాలి నాని
ఎస్​ఈసీ ఆదేశాల అమలు నిలిపివేయండి : మంత్రి కొడాలి నాని

By

Published : Feb 14, 2021, 3:18 AM IST

Updated : Feb 14, 2021, 7:52 AM IST

పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం, కమిషనర్​పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేయాల్సిందిగా.. కృష్ణా జిల్లా ఎస్పీకి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిలోని 1,4 క్లాజుల కింద, ఐపీసీలోని 504, 505(1) (సి), 506తో పాటు, దీనికి వర్తించే ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని శనివారం ఆదేశించారు. పంచాయతీ ఎన్నికల తుది విడత పోలింగ్ పూర్తయ్యే వరకు మీడియాతో గానీ, సమావేశాల్లో గానీ, బృందాలతో గానీ మాట్లాడవద్దని నానిని శుక్రవారమే ఆదేశించారు. ఉత్తర్వులు అమలయ్యేలా చూడాలని కృష్ణా జిల్లా కలెక్టర్​, ఎస్పీ, విజయవాడ కమిషనర్లకు ఆదేశాలిచ్చారు.

ఆ ఉత్తర్వుల అమలును నిలిపివేయండి : కోడాలి నాని

రాష్ట్రంలో ఈ నెల 21న పంచాయతీ ఎన్నికలు ముగిసే వరకూ మీడియాతో మాట్లాడవద్దని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఈ నెల 12న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ.. మంత్రి కొడాలి నాని శనివారం అత్యవసరంగా హైకోర్టు తలుపు తట్టారు. రాజ్యాంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛను కమిషనర్ ఉత్తర్వులు హరించేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే సదరు ఉత్తర్వుల అమలును నిలుపుదల చేస్తూ మధ్యంతర ఆదేశాలివ్వాలన్నారు.

వివరణ సంతృప్తికరంగా లేదు : ఎస్​ఈసీ

విలేకర్ల సమావేశంలో కమిషనర్​ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా, ఎస్ఈసీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయని మంత్రి నానికి కమిషనర్ షోకాజ్ నోటీస్ ఇచ్చిన విషయం తెలిసిందే. దానిపై మంత్రి ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవటంతో ఈనెల 21 వరకు మీడియాతో మాట్లాడవద్దని, అప్పటివరకు సమావేశాల్లో గానీ, బృందాలతో గానీ మంత్రి మాట్లాడరాదని స్పష్టం చేశారు. ఆ ఉత్తర్వులపై మంత్రి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై ఎప్పుడు విచారణ జరపాలనేది హైకోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

'అవి రాజ్యాంగ విరుద్ధం'

కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని, మధ్యాహ్నం నోటీసులు ఇచ్చి సాయంత్రంలోపు వివరణ ఇవ్వాలని కోరారు. షోకాజ్ నోటీసులు ఇవ్వడానికి గల ఆధారాల్ని నాకు అందజేయలేదు. రాజ్యాంగ బద్ధ సంస్థల పట్ల గౌరవం ఉందని, ఎన్నికల సంఘం స్థాయిని తగ్గించే విధంగా వ్యాఖ్యలు చేయలేదన్న వివరణను పరిగణలోకి తీసుకోలేదు. మీడియాతో మాట్లాడకుండా నిలువరించడమే కాకుండా, ఐపీసీ, ఎన్నికల నియమావళి కింద కేసు నమోదు చేయాలని ఎస్పీని ఆదేశించారు. ఎస్ఈసీకి వ్యతిరేకంగా నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

- కొడాలి నాని, పౌరసరఫరాల శాఖ మంత్రి

ఇదీచదవండి.

ఎన్నికల కమిషనర్ గారు.. వారిపై చర్యలు తీసుకోండి : చంద్రబాబు

Last Updated : Feb 14, 2021, 7:52 AM IST

ABOUT THE AUTHOR

...view details