పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులకు జారీ చేసే కుల ధ్రువీకరణ పత్రాలు, వారు ప్రభుత్వానికి ఎలాంటి బకాయిలు లేరని నిర్ధారిస్తూ జారీ చేసే నో డ్యూ సర్టిఫికెట్లపై ముఖ్యమంత్రి జగన్ ఫొటోను తొలగించాలని.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశించారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌కు శుక్రవారం లేఖ రాశారు. ఆ పత్రాలపై ముఖ్యమంత్రి సహా ఏ రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తుల ఫొటోలు ఉండటానికి వీల్లేదన్నారు. ధ్రువీకరణ పత్రాలపై సీఎం ఫొటో ఉండటం ఎన్నికల నియమావళికి విరుద్ధమన్నారు. దానిపై కొన్ని రాజకీయ పార్టీలు అభ్యంతరం తెలిపాయని వివరించారు.
"ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఏ ఓటరుకైనా ఎలాంటి వివక్ష, జాప్యం లేకుండా ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేలా అధికారుల్ని ఆదేశించండి. అప్పుడే వారు సకాలంలో నామినేషన్లు వేయగలుగుతారు" అని రమేశ్ కుమార్ పేర్కొన్నారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకుని, ఆ విషయాన్ని ఎస్ఈసీకి నివేదించాలని ఆదేశించారు.