ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు

షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తాం: ఎస్‌ఈసీ
షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తాం: ఎస్‌ఈసీ

By

Published : Jan 21, 2021, 11:08 AM IST

Updated : Jan 22, 2021, 6:51 AM IST

11:07 January 21

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు గతంలో ప్రకటించిన షెడ్యూలు ప్రకారమే 4 దశల్లో జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల కమిషనరు (ఎస్‌ఈసీ) రమేశ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. ఫిబ్రవరి 5, 9, 13, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ జరుగుతుందని ఆయన గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు ఉన్న అవరోధాల్ని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తొలగించింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేస్తామని, ఎన్నికల తేదీలను మార్చాలని కోరబోమని రాష్ట్ర ప్రభుత్వం ఇది వరకే ధర్మాసనానికి తెలియజేసింది. ఇదివరకు ప్రకటించిన షెడ్యూలు ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తుంది’ అని ఎస్‌ఈసీ వెల్లడించారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో.. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని చెప్పారు.

ప్రజాప్రతినిధులెవరూ ప్రభుత్వ పథకాల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొనరాదని, ఓటర్లను ప్రభావితం చేయరాదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇప్పటికే సూచించానని తెలిపారు. మరోవైపు రమేశ్‌కుమార్‌ శుక్రవారం ఉదయం 11 గంటలకు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలవనున్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు, తదితర అంశాల్ని ఆయనకు వివరించనున్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరించేలా చూడాలని గవర్నర్‌కు ఆయన విజ్ఞప్తి చేయనున్నట్టు తెలిసింది.

11 జిల్లాల కలెక్టర్లతో సమావేశం

ఎన్నికల ఏర్పాట్లపై ఎస్‌ఈసీ రమేశ్‌కుమార్‌ గురువారం 11 జిల్లాల కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. గత మార్చిలో స్థానిక సంస్థల   ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో పెద్ద ఎత్తున హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోవడంతో... ఆ రెండు జిల్లాల కలెక్టర్లను మార్చాలని అప్పట్లోనే ప్రభుత్వానికి ఎస్‌ఈసీ లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఆ రెండు జిల్లాల   కలెక్టర్లు మినహా, మిగతా 11 జిల్లాల కలెక్టర్లతో ఎస్‌ఈసీ మాట్లాడినట్టు తెలిసింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి పక్కాగా అమలయ్యేలా చూడాలని,  తొలి దశ పంచాయతీ ఎన్నికలకు ఈ నెల 23న నోటిఫికేషన్‌ వెలువడనున్నందున కలెక్టర్లు సిద్ధంగా ఉండాలని ఎస్‌ఈసీ సూచించినట్టు సమాచారం. గుంటూరు, చిత్తూరు కలెక్టర్లతో పాటు, గతంలో  ఎన్నికల కమిషన్‌ సూచించిన కొందరు పోలీసు అధికారుల్నీ విధుల నుంచి తప్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌కి గురువారం మరోసారి రమేశ్‌కుమార్‌ సూచించారు. చిత్తూరు అర్బన్‌, గుంటూరు రూరల్‌ ఎస్పీలతో పాటు మరికొందరు పోలీసు అధికారుల్నీ విధుల నుంచి తప్పించాలని  ఇది వరకు రాసిన లేఖను.. గురువారం సీఎస్‌కు రాసిన లేఖకు జతచేశారు.

ఓటర్ల భద్రత ప్రభుత్వ బాధ్యతే

‘ఎన్నికల సిబ్బందితోపాటు, ఓటర్ల భద్రతనూ ఎన్నికల కమిషన్‌ దృష్టిలో ఉంచుకుంది. దాని కోసం ప్రభుత్వం పాటించాల్సిన సమగ్ర భద్రతా నియమావళిని ప్రొసీడింగ్స్‌లో పొందుపరిచింది. పోలింగ్‌ సిబ్బంది, ఓటర్లకు పూర్తి భద్రత కల్పించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలి. గత అనుభవాల్నిబట్టి శాంతి భద్రతల నిర్వహణపై కమిషన్‌ ప్రత్యేక దృష్టి పెడుతుంది’ అని ఎస్‌ఈసీ తెలిపారు. ఎన్నికల్ని స్వేచ్ఛగా, సజావుగా నిర్వహించేందుకు సహకరించాల్సిందిగా ఈ ప్రక్రియలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. కరోనా నియంత్రణలోనూ గ్రామ పంచాయతీలది కీలక భూమిక’ అని ఆయన పేర్కొన్నారు.

ఏర్పాట్లు చేయాలని సీఎస్‌కు లేఖ

హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఎస్‌ఈసీ రమేశ్‌కుమార్‌ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నాహాల్ని ప్రారంభించారు. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజా శంకర్‌లకు లేఖలు రాశారు. ఏర్పాట్లు, ఓటర్ల జాబితాల సంసిద్ధతపై శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ఎన్నికల సంఘం కార్యాలయంలో జరిగే సమావేశానికి హాజరవ్వాలని ద్వివేది, గిరిజా శంకర్‌లకు ఆయన సూచించారు.

చినవేంకన్నను దర్శించుకున్న ఎస్‌ఈసీ

ద్వారకా తిరుమల, న్యూస్‌టుడే: రాష్ట్ర ఎన్నికల కమిషనరు నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ గురువారం పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుని పూజలు చేశారు. ఆయనకు ఆలయ అర్చకులు, పండితులు వేద ఆశీర్వచనం చేసి ప్రసాదాలను అందజేశారు. ఈవో భ్రమరాంబ శ్రీవారి జ్ఞాపికను బహూకరించారు.

ఇదీ చదవండి:

పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

Last Updated : Jan 22, 2021, 6:51 AM IST

ABOUT THE AUTHOR

...view details