రాష్ట్రంలో అక్రమ రవాణాను అరికట్టేందుకు 'ఆపరేషన్ నిఘా' పేరుతో ఎస్ఈబీ పోలీసులు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 269 బృందాలు పాల్గొన్నాయి. ప్రధానంగా మద్యం అక్రమ రవాణా, ఇసుక తవ్వకాలు, నిల్వలు, గుట్కా, గంజాయి వంటివాటిపై దృష్టి సారించాయి.
అక్రమ రవాణాపై ఉక్కుపాదం
ఈ ఆపరేష్లో భాగంగా మొత్తం 1088 కేసులు నమోదు చేయడంతో పాటు 1537 మందిని అదుపులోకి తీసుకున్నారు. 192 వాహనాలు, 3,652 సీసాల లిక్కర్‌ను స్వాధీనం చేసుకున్నారు. 530 కేజీల గంజాయి, 349 టన్నుల ఇసుక, రూ. 45 లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లు పట్టుకున్నారు. పేకాట శిబిరాలపై దాడులు చేశారు. తనిఖీల్లో రూ. 24 లక్షల నగదు, అక్రమంగా రవాణా చేస్తున్న 1.5 కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నారు.
అనంతపురంలో..
అక్రమంగా కర్ణాటక మద్యం విక్రయిస్తున్న ఓ వ్యక్తిని తనకల్లు పోలీసులు అరెస్టు చేసి 56 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. తనకల్లు మండలం గుర్రం బయలులో మద్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడులు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.