'నివార్' తుపాను వల్ల చెన్నై, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున.. రైల్వే అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా ఆదేశించారు. జోన్ పరిధిలోని డివిజినల్ రైల్వే మేనేజర్లతో సికింద్రాబాద్లోని రైల్ నిలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విజయవాడ, గుంతకల్లు, గుంటూరు, సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డీఆర్ఎంలు సమావేశంలో పాల్గొన్నారు.
నివార్ తుపాను దృష్ట్యా సన్నద్ధత, భద్రత, సరకు రవాణా అంశాలపై సమీక్షించారు. భద్రత కోసం అన్ని డివిజన్లు ప్రణాళికాబద్ధమైన కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని జీఎం ఆదేశించారు. రైలు సర్వీసులకు ఎలాంటి అవాంతరాలు లేకుండా సాఫీగా సాగేలా చూడాలన్నారు. అధికారులందరూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. గత నెలతో పోలిస్తే ఈ నెలలో సరకు లోడింగ్ పెరగడంపై జీఎం సంతోషం వ్యక్తం చేశారు. రైల్వే స్టేషన్లు, రైళ్లలో ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేయాలని డీఆర్ఎంలకు సూచించారు.