ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జులై 5 నుంచి మోగనున్న బడిగంట.. అకడమిక్‌ కేలండర్‌ రిలీజ్ - జులై 5 నుంచి బడులు తాజా వార్తలు

రాష్ట్రంలోని పాఠశాలలు జులై 5 నుంచి పునఃప్రారంభమై.. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 29వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఇప్పటి వరకు ప్రతి ఏడాది జూన్‌ 12న పాఠశాలలు పునఃప్రారంభమై ఏప్రిల్‌ 23వరకు కొనసాగేవి. ఈ ఏడాది పునఃప్రారంభ సమయాన్ని మార్చేశారు. జులై ఐదో తేదీకి తీసుకొచ్చారు.

schools to be reopened on july 5th
జులై 5 నుంచి బడులు

By

Published : Jun 27, 2022, 7:42 AM IST

రాష్ట్రంలోని పాఠశాలలు జులై 5 నుంచి పునఃప్రారంభమై.. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 29వ తేదీ వరకు కొనసాగనున్నాయి. పాఠశాలలకు ఉండే మూడు స్థానిక సెలవులను వినియోగించుకుంటే వాటికి బదులు అదే నెలలో రెండో శనివారం, ఆదివారాల్లో బడులు నిర్వహించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ప్రతి ఏడాది జూన్‌ 12న పాఠశాలలు పునఃప్రారంభమై ఏప్రిల్‌ 23వరకు కొనసాగేవి. ఈ ఏడాది పునఃప్రారంభ సమయాన్ని మార్చేశారు. జులై ఐదో తేదీకి తీసుకొచ్చారు. జులై 5 నుంచి ఏప్రిల్‌ 29 వరకు 2022-23 విద్యా సంవత్సరంలో బడులు 220 రోజులు పని చేస్తాయి.

1-9 తరగతులకు సమ్మెటివ్‌-2 పరీక్షలు ఏప్రిల్‌ 27తో ముగుస్తాయి. ఈ మేరకు 2022-23 విద్యా సంవత్సరానికి రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్టీ) అకడమిక్‌ కేలండర్‌ను విడుదల చేసింది. ప్రతి తరగతికి వారానికి 48 పిరియడ్లు ఉంటాయి. సబ్జెక్టు ఉపాధ్యాయులు వారానికి 38 నుంచి 39 పిరియడ్లు బోధించాల్సి ఉంటుంది.

1-5 తరగతులకు మొదటి 40రోజులు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 9వ తరగతి వరకు 30రోజుల పాటు విద్యార్థులను సంసిద్ధం చేసే కార్యక్రమాలు నిర్వహిస్తారు. పూర్వప్రాథమిక విద్య, ఒకటి రెండు తరగతులు ఉండే ఫౌండేషన్‌, 1-5 తరగతుల ఫౌండేషన్‌ ప్లస్‌ పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 3.30 వరకు కొనసాగుతాయి. సాయంత్రం 3.30 నుంచి 4 వరకు ఆటలు, పునశ్చరణ తరగతుల నిర్వహణ ఐచ్ఛికం.

ప్రీహైస్కూల్‌, హైస్కూల్‌, హైస్కూల్‌ ప్లస్‌ పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు నిర్వహించాల్సి ఉంటుంది. 4 గంటల నుంచి 5గంటల వరకు ఆటలు, పునశ్చరణ తరగతులను ఆయా బడులు ఐచ్ఛికంగా నిర్వహించుకోవచ్చు. వారంలో ఒక రోజు ‘నో బ్యాగ్‌ డే’ ఉంటుంది.

సెప్టెంబరు 26నుంచి దసరా సెలవులు

  • దసరా సెలవులు సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 6వరకు ఉంటాయి.
  • క్రిస్మస్‌ సెలవులు డిసెంబరు 23 నుంచి జనవరి ఒకటి వరకు ఇస్తారు.
  • క్రిస్టియన్‌ మైనారిటీ పాఠశాలలకు దసరా సెలవులు అక్టోబరు 1 నుంచి 6వరకు ఇస్తారు.
  • సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 11 నుంచి 16 వరకు ఉంటాయి.

పరీక్షలు ఇలా..

  • ఫార్మెటివ్‌-1 పరీక్షలు సెప్టెంబరు 7-9, ఫార్మెటివ్‌-2 పరీక్షలు అక్టోబరు 13-15 తేదీల్లో నిర్వహిస్తారు.
  • సమ్మెటివ్‌-1 పరీక్షలు నవంబరు 21-30 వరకు, ఫార్మెటివ్‌-3 వచ్చే ఏడాది జనవరి 19-21, ఫార్మెటివ్‌-4 ఫిబ్రవరి 6-8 తేదీల్లో ఉంటాయి.
  • పదో తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి 22 నుంచి మార్చి 4వరకు ప్రీఫైనల్‌ పరీక్షలు
  • 1-9 తరగతులకు సమ్మెటివ్‌-2 పరీక్షలు ఏప్రిల్‌ 13 నుంచి 27వరకు ఉంటాయి.
  • 28 నుంచి పాఠశాలలకు టీచర్లు

పాఠశాలల ఉపాధ్యాయులు ఈ నెల 28 నుంచి బడులకు వెళ్లాల్సి ఉంటుంది. విద్యార్థులు వచ్చే సరికి పాఠశాల ప్రాంగణాన్ని శుభ్రం చేయించడం, తరగతి గదులను అలంకరించడం లాంటివి చేయాలని విద్యాశాఖ పేర్కొంది. పాత పుస్తకాలను సేకరించి బుక్‌ బ్యాంకు ఏర్పాటు చేయాలని సూచించింది.

29న తల్లిదండ్రుల కమిటీలు, ఇతర ప్రభుత్వ విభాగాలతో కలిపి సమావేశాలు నిర్వహించడం, 30న ప్రవేశాల కోసం సమీపంలోని పాఠశాలలకు ఆశ్రయించడం, గూగుల్‌ రీడింగ్‌ కార్యక్రమానికి సంబంధించిన రికార్డులను గ్రామ, వార్డు సచివాలయ సంక్షేమ సహాయకుల నుంచి స్వాధీనం చేసుకోవాలని పేర్కొంది. విద్యా కానుకల కిట్లను జులై 5న పంపిణీ చేయాలని ఆదేశించింది.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details