ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మమ్మల్ని కదిలిస్తే.. వచ్చే ఎన్నికల్లో నిలువనీడ లేకుండా చేస్తాం' - విజయవాడలో ఎస్సీ నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం తాజా వార్తలు

మమ్మల్ని కదిలిస్తే వచ్చే ఎన్నికల్లో నిలువనీడ లేకుండా చేస్తామంటూ... ప్రభుత్వాన్ని ఎస్సీ నాయకులు హెచ్చరించారు. ఎస్సీలపై దాడులు, అత్యాచారాలపై ఛార్జ్‌షీట్‌ విడుదల చేస్తామని, ఆ వర్గంలో ధైర్యం నింపేందుకు 5 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేపడతామని ప్రకటించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి ఎస్సీలపై ఉద్దేశపూర్వక దాడులు జరుగుతున్నాయని ఆగ్రహించారు.

'మమ్మల్ని కదిలిస్తే.. వచ్చే ఎన్నికల్లో నిలువనీడ లేకుండా చేస్తాం'
'మమ్మల్ని కదిలిస్తే.. వచ్చే ఎన్నికల్లో నిలువనీడ లేకుండా చేస్తాం'

By

Published : Sep 27, 2020, 6:28 AM IST

Updated : Sep 27, 2020, 7:02 AM IST

రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎస్సీలపై ఉద్దేశపూర్వకంగానే దాడులు జరుగుతున్నాయని, ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని పలువురు ఎస్సీ నాయకులు ధ్వజమెత్తారు. ఎస్సీలు, మైనారిటీలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, అరాచకాలపై ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ రెండు మూడు రోజుల్లో ఛార్జిషీటు విడుదల చేయాలని తీర్మానించారు. ‘‘రాష్ట్రంలో దళిత, బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలపై న్యాయపోరాటానికి భవిష్యత్‌ కార్యాచరణ’’ పేరుతో ‘జైభీమ్‌ యాక్సెస్‌ జస్టిస్‌’ సంస్థ ఆధ్వర్యంలో శనివారం విజయవాడలో రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. ఆ సంస్థ కన్వీనర్‌, మాజీ జడ్జి, హైకోర్టు న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో.. మాజీ ఎంపీ హర్షకుమార్‌ సహా పలువురు మాజీ న్యాయమూర్తులు, న్యాయవాదులు, దళిత, గిరిజన, ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. సీతానగరం శిరోముండనం, రాజమండ్రి అత్యాచార ఘటనల్లో బాధితులూ హాజరయ్యారు. ఎస్సీల్లో ఆత్మస్థైర్యం, భరోసా కల్పించేందుకు త్వరలో 5వేల కి.మీ.ల పాదయాత్ర చేపడుతున్నట్టు శ్రావణ్‌కుమార్‌ ప్రకటించారు. ‘‘రాష్ట్రంలో ఎస్సీల సింహగర్జన మొదలైంది. ముఖ్యమంత్రి జగన్‌ రాజ్యాంగం ప్రకారం పాలించాలి. మేం ఆత్మగౌరవంతో బతుకుతున్నాం. మమ్మల్ని కదిలిస్తే 2024 ఎన్నికల్లో నిలువ నీడ లేకుండా చేస్తాం’’ అని ఆయన హెచ్చరించారు.

న్యాయస్థానాలు లేకపోతే మరింత దారుణం
‘‘అందరికీ సమానహక్కులు, న్యాయం అందాల్సిన దేశంలో వ్యక్తుల పలుకుబడి, సామాజికవర్గం ఆధారంగా జరుగుతున్న పరిణామాలు దేశానికి మంచివి కావు. న్యాయస్థానాలు లేకపోతే రాష్ట్రంలో ఎస్సీల పరిస్థితి మరింత దారుణంగా ఉండేది’’ అని చిత్తూరు జిల్లాకు చెందిన న్యాయమూర్తి రామకృష్ణ పేర్కొన్నారు.

ఎప్పుడూ తిరస్కరణే
‘‘మనం న్యాయం కోసం ఉద్యమించాల్సిన తరుణం వచ్చింది. మనం ఎప్పుడూ తిరస్కరణకే గురవుతున్నాం. రూ.500 దొంగతనం చేసిన ఎస్సీలు జైల్లో ఉంటే రూ.లక్షల కోట్లు దోచేసినవారు రాజకీయ నాయకులుగా చలామణి అవుతున్నారు. రాజ్యాధికారానికి మనం దగ్గరగా ఉండాలి’’ అని హైకోర్టు న్యాయవాది శోభారాణి పేర్కొన్నారు.

నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారు
‘‘మార్చి 22న నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారు. మధ్యాహ్నం రెండు గంటలకు పోలీసు స్టేషన్‌కి వెళితే రాత్రి పదింటి వరకు ఫిర్యాదు తీసుకోలేదు. మాజీ ఎంపీ జ్ఞానేంద్రరెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి రాజీ ప్రయత్నాలు చేశారు. మంత్రి పెద్దిరెడ్డి నాతో అగౌరవంగా, సంస్కారహీనంగా మాట్లాడారు’’ అని డాక్టర్‌ అనితారాణి పేర్కొన్నారు. ఈ సమావేశంలో విశాఖకు చెందిన మాజీ జడ్జి జయసూర్య, వివిధ దళిత, గిరిజన, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

రహస్య అజెండా అమలు..

‘‘ప్రార్థనా మందిరాలపై దాడుల పేరుతో రాష్ట్రంలో రహస్య అజెండా అమలు చేస్తున్నారు. ఎస్సీలు జగన్‌కు దూరమవుతున్నారు. తిరిగి వారిని దగ్గరకు చేర్చుకునేందుకే మతపరమైన దాడుల అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. ప్రభుత్వంపై భాజపా, ఆరెస్సెస్‌ విమర్శలు చేయడం ద్వారా జగన్‌పై ఎస్సీల్లో ఆదరణ పెంచుతున్నారు. తిరుపతిలో ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక ముఖ్యమంత్రుల పక్కన మంత్రి పెద్దిరెడ్డి కూర్చుంటే.. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి వారి వెనుక చేతులు కట్టుకుని ఉన్నారు. రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఆదేశం వచ్చినా శిరోముండనం బాధితుడు వరప్రసాద్‌కు న్యాయం జరగలేదు’’ అని మాజీ ఎంపీ హర్షకుమార్‌ ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి:అశ్రునయనాలతో బాలుకు అంతిమ వీడ్కోలు

Last Updated : Sep 27, 2020, 7:02 AM IST

ABOUT THE AUTHOR

...view details