Diversion of grama panchayats funds: గ్రామ పంచాయతీలకు విధులు, నిధులతోనే పాలనా వికేంద్రీకరణ. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు విధులివ్వకపోగా, వివిధ రూపాల్లో సమకూరిన ఆదాయాన్ని మళ్లించుకుంటోంది. ఈ ఏడాది కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులు రూ. 12 వందల 45 కోట్ల లాగేసుకుంది. ఇంటి, నల్లా పన్నులు వంద శాతం వసూలు చేయాలంటూ సర్పంచులు, పంచాయతీ సిబ్బంది మెడపై కత్తిపెట్టి వసూలు చేయించిన సొమ్మును ఖాతాల్లోంచి ఖాళీ చేసింది. నియోజకవర్గ అభివృద్ధి నిధి పేరిట ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 2 కోట్లు ఇస్తామన్న ప్రభుత్వం.. పంచాయతీలకు మాత్రం పైసా ఇవ్వకపోవడం వికేంద్రీకరణ ఎలా అవుతుందని సర్పంచులు ప్రశ్నిస్తున్నారు.
అప్పుల కోసం ఎప్పటికప్పుడు వెంపర్లాడుతున్న సర్కారు.. ఎవరడుగుతారులే అన్న అధికార దర్పంతో సర్పంచులకు తెలియకుండానే పంచాయతీల ఖాతాల్ని ఖాళీ చేస్తోంది. ఎంత సొమ్ము తీసుకుందో సమాచారమివ్వని ప్రభుత్వం.. ఎప్పుడు తిరిగిస్తామో చెప్పకుండా చిన్నచూపుతో వ్యవహరిస్తోంది. ఎన్నికలు నిర్వహించి ఏడాదవుతున్నా గ్రామాల అభివృద్ధికి ఎలాంటి చేయూత ఇవ్వడం లేదని.. దీంతో చిన్న అభివృద్ధి పని కూడా చేయలేకపోతున్నామని సర్పంచులు వాపోతున్నారు. మితిమీరిన జోక్యంతో పంచాయతీలను ప్రభుత్వమే నిర్వీర్యం చేస్తోందని.. రోజు వారీ అవసరాలకు రూపాయి ఖర్చు చేసే అవకాశం లేక భిక్షాటన చేయాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయని వాపోతున్నారు.
ఏడాది కాలంలో పంచాయతీల నుంచి ప్రభుత్వం రూ. 2వేల కోట్లకు పైగా తీసుకుంది. ఇందులో 14, 15 ఆర్థిక సంఘం నిధుల కింద కేంద్రం ఇచ్చిన రూ. 1,245 కోట్లను విద్యుత్తు ఛార్జీల కింద రెండు విడతల్లో తీసుకుంది. దీంతో ఏడు నెలలుగా గ్రామాల్లో అభివృద్ధి నిలిచిపోయి ఎలాంటి పనులు చేపట్టే పరిస్థితి లేదు. 2021-22 సంవత్సరానికి రెండో విడత 15వ ఆర్థిక సంఘం నిధుల కోసం పంచాయతీలు ఎదురు చూస్తున్నాయి. దాదాపు 960 కోట్ల ఈ నిధులను కేంద్ర ప్రభుత్వం 2022 మార్చి నెలాఖరులోగా రాష్ట్రాలకు విడుదల చేయాలి. కేంద్రం నిధులు విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా బయటపెట్ట లేదా? నిధుల విడుదలలో కేంద్రమే జాప్యం చేస్తుందా? అనేది తెలియాలి.
పంచాయతీల నుంచి రాష్ట్ర ప్రభుత్వం మళ్లించిన సాధారణ నిధులెంత అనే విషయంలోనూ అధికారులు నోరుమెదపడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 13,371 గ్రామ పంచాయతీలు ఉండగా.. ఒక్కో దానిలో సగటున 2 లక్షల నుంచి 20 లక్షల వరకు సాధారణ నిధులు ఉంటాయన్నది అంచనా. పెద్ద పంచాయతీల్లో అయితే కోట్లలో నిధులు ఉండనున్నాయి. ప్రత్యేకించి కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో పన్నులు, పన్నేతరాలు 70 శాతం వరకు వసూలవుతాయి. 2021-22 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగుస్తుందన్న కారణంతో అధికారులు గత మూడు, నాలుగు నెలలుగా పన్నుల వసూళ్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా 65 శాతానికిపైగా వసూళ్లు జరిగాయి.
ఒక్కో పంచాయతీలో సగటున 5 లక్షలు చొప్పున సాధారణ నిధులు ఉన్నాయనుకున్నా.. 668 కోట్లకుపైగా నిధులు ఖాళీ చేసినట్లు అంచనా. అయితే 1,000 కోట్లకుపైగా నిధులు ఖాళీ చేశారని సర్పంచులు చెబుతున్నారు. నిరసనలు వ్యక్తం చేస్తూ రోడ్లుపైకి వస్తున్నా, బిక్షాటనలు చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. సాధారణ నిధుల ఖాతాలు ఖాళీ చేయడమనేది గతంలో ఎప్పుడూ చూడలేదని విశ్రాంత పంచాయతీ అధికారి ఒకరు చెప్పారు.
కృష్ణా జిల్లా ప్రసాదంపాడు పంచాయతీలో 15 లక్షల సాధారణ నిధులు మళ్లించడంతో ఖాతా ఖాళీ అయ్యింది. వేసవితో పెరిగిన తాగునీటి అవసరాల దృష్ట్యా సాధారణ నిధులతో కొత్తగా బోర్లు వేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. నిధులు మళ్లింపుతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఇదే పంచాయతీ నుంచి విద్యుత్తు ఛార్జీల బకాయిల కింద 75 లక్షల ఆర్థిక సంఘం నిధులు ప్రభుత్వం మళ్లించింది.కర్నూలు జిల్లా కోడుమూరు మేజర్ పంచాయతీలో దాదాపు 90 లక్షలు నిధులు మళ్లించారు. పన్నులతోపాటు షాపింగ్ కాంప్లెక్సు నుంచి వచ్చే అద్దెలు, ఇతర ఆదాయం సాధారణ నిధుల ఖాతాలో జమ చేశారు.