భక్తుల కొంగు బంగారం విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ. అమ్మవారికి సమర్పించిన ప్రసాదమైనా, కానుకలైనా భక్తులు కళ్లకద్దుకుని తీసుకుంటారు. వాటిని పరమ పవిత్రంగా భావిస్తారు. అందులోనూ దుర్గమ్మకు సమర్పించిన చీరలను ఇష్టపడి ఇంటికి తీసుకెళ్తారు. ఇప్పుడు ఈ చీరలపైనా మోసగాళ్ల కన్నుపడింది.
వేలం కేంద్రంలో అమ్మకాలు
సాధారణంగా చీరలకు ఎంతో కొంత కనీస ధర నిర్ణయించి ఆలయ ప్రాంగణంలోనే భక్తులకు విక్రయిస్తారు. అమ్మవారికి ముడుపులు, కానుకలుగా భక్తులు సాధారణ రకం నుంచి ఖరీదైన పట్టుచీరల వరకు సమర్పిస్తుంటారు. పట్టుచీరలను అమ్మవారికి అలంకరిస్తారు. ఇతర చీరలను అమ్మవారి పాదాల వద్ద ఉంచి వాటిని వేలం కేంద్రం వద్దకు తీసుకొస్తారు. భక్తులు అందజేసిన చీర విలువను పుస్తకంలో నమోదు చేసుకుని, వివరాలను కంప్యూటరులో పొందుపరిచి ఆ చీరకు ఓ ట్యాగ్ వేస్తారు. ఆ విలువకు మించి తక్కువకుగానీ, ఎక్కువకుగానీ విక్రయించడానికి లేదు. ఇదీ ప్రస్తుతం ఆలయ విధానం.
తక్కువ ధరకే అమ్మకాలంటూ ఫోన్లు
గత కొద్ది రోజుల నుంచి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పలువురు భక్తులకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్లు వెళ్లాయి. అమ్మవారికి అలంకరించిన రూ. 5 వేల విలువైన చీరను.. రూ. 2 వేలకే విక్రయిస్తున్నట్లు వస్తున్న ఫోన్లు భక్తులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. అమ్మవారిపై విశ్వాసం, భక్తి భావాన్ని ఆసరాగా చేసుకుని వారిని వలలో వేసుకునేందుకు మోసగాళ్లు ప్రయత్నిస్తున్నారు. గతంలో అమ్మవారి ఆలయంలో పనిచేసిన ఓ ఉద్యోగిని, విజయవాడకు చెందిన ఓ పోలీసు అధికారి, దుర్గగుడి ప్రస్తుత ఈవో కుటుంబ సభ్యులకు మోసగాళ్ల నుంచి ఫోన్లు రావటంతో వారు అప్రమత్తమయ్యారు. వారికి ఆలయ అధికారులు, యంత్రాంగంతో పరిచయం ఉన్నందున.. మోసగాళ్ల వలలో చిక్కకుండా జాగ్రత్తపడ్డారు. అయితే ఇలా ఎంతమంది మోసపోయారో అనే ఆందోళన ఆలయ పాలక మండలి అధికారుల్లో వ్యక్తమవుతోంది. లక్కీడ్రా పేరుతో మోసగాళ్ల నుంచి వచ్చే ఫోన్లకు భక్తులు స్పందించవద్దని ఈవో సూచించారు.