ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

SANKRANTHI SAMBARALU: రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా సంక్రాంతి సంబరాలు

SANKRANTHI SAMBARALU: తెలుగు లోగిళ్లలో సంక్రాంతి శోభ ఉట్టిపడుతోంది. పల్లె, పట్టణాల్లోని ప్రతి ఇంటి ముంగిట రంగవల్లులు హరివిల్లులను తలపిస్తున్నాయి. కొత్త కోడళ్లు, అల్లుళ్లు, బంధుమిత్రుల రాకతో పల్లెలు కోలాహలంగా మారాయి. నిన్నంతా భోగి భాగ్యాలతో సంబరాలు జరుపుకున్న తెలుగు ప్రజలు.. నేడు సంక్రాంతికి స్వాగతం చెబుతూ తెల్లవారుజాము నుంచే సందడి చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా సంక్రాంతి సంబరాలు
రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా సంక్రాంతి సంబరాలు

By

Published : Jan 15, 2022, 6:29 AM IST

SANKRANTHI SAMBARALU: హరిదాసుల కీర్తనలు, డూడూ బసవన్నల దీవెనలు..! ఇంటి ముందు అందమైన రంగవల్లులు, గొబ్బెమ్మలు..! వేకువజామునే జంగమదేవరల జేగంటలు, ఢమరుక నాదాలు..! అక్కడక్కడా పిట్టలదొరల బడాయి మాటలతో.. పట్టణాలు, పల్లెలు సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి.

విశాఖ జిల్లాలో...

విశాఖలోనూ సంక్రాంతి శోభ ఉట్టిపడింది. వీఎమ్​ఆర్డీఏ బాలల ప్రాంగణంలో నిర్వహించిన సంబరాలు అంబరాన్నంటాయి. ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, గంగిరెద్దు మేళలు సందడి చేశాయి. చిన్నారులు సాంస్కృతిక నృత్యాలతో అలరించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో చెంచుల సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. అడవిలో చెంచులక్ష్మీ, శ్రీకృష్ణుణ్ని ప్రేమ కలాపం ఇతివృత్తంగా నృత్యం చేస్తూ అలరించారు.

కర్నూలులో...

కర్నూలులో వాసవీ సేవాదళ్‌ ఆధ్వర్యంలో... సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. గంగిరెద్దుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. పిల్లలందరికీ పెద్దలు భోగి పళ్లు పోశారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను కట్టిపడేశాయి. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

విజయవాడలో...

విజయవాడలో ఏపీ టూరిజం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలు కృష్ణమ్మ తీరాన అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పెయింటింగ్ కళాకారులు... తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా చిత్రాలు గీశారు. వారి బొమ్మల్లో పల్లెదనం కళ్లకు కట్టేలా చూపించారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

భవానీ ద్వీపంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో యువత, నగర ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. బోటింగ్‌లో విహరిస్తూ కృష్ణమ్మ అందాలను ఆస్వాదించారు. సెల్పీలతో సందడి చేశారు.

ప్రకాశం జిల్లాలో...

ప్రకాశం జిల్లా చీరాల సంతబజార్‌లో శ్రీ భద్రావతి సమేత శ్రీ బావనారుషి దేవాలయంలో... స్వామివారి కల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సంక్రాంతి సందర్భంగా 10 రోజులపాటు జరిగే ఉత్సవాల్లో విశేషపూజల, కల్యాణం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ముందుగా మేళతాళాలతో నగరోత్సవం నిర్వహించారు. 216 మంది మహిళలు బిందెలతో స్వామివారికి జలాభిషేకం చేశారు. గుంటూరులోని సంపత్‌నగర్‌లోని అయ్యప్పస్వామి ఆలయంలో మకరజ్యోతి ఉత్సవం వైభవంగా నిర్వహించారు. స్వామివారి అభరణాలను, ఉత్సవమూర్తిని ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం శబరిమలైలో కనిపించే జ్యోతి దర్శనం తరహాలో మకరజ్యోతిని వెలిగించారు.

ఇదీ చదవండి:

ప్రియాంక ఫొటో షూట్.. స్టిల్స్ పిచ్చెక్కిస్తున్నాయ్!

ABOUT THE AUTHOR

...view details