రాష్ట్రంలో జోన్ల వారీగా ఇసుక తవ్వకాలు, విక్రయాల బాధ్యతలు చేపట్టే ఏజెన్సీ, లీజుదారుడు.. రీచ్‌లు, స్టాక్ పాయింట్ల వద్ద నిర్ణయించిన ధరకే విక్రయించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏజెన్సీ పాటించాల్సిన నిబంధనలను, ప్రస్తుతమున్న ఇసుక మైనింగ్ విధానంలో సవరణలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో కొన్ని వర్గాలకు ఇచ్చిన రాయితీలు, వెసులుబాట్లలో మార్పులు చేయగా, మరికొన్నింటిని తొలగించింది. రీచ్, స్టాక్ పాయింట్ వద్దకు వచ్చిన వినియోగదారుడు నచ్చిన ఇసుకను ఎంపిక చేసుకొని, సొంత వాహనంలో తీసుకెళ్లవచ్చని స్పష్టంచేసింది.
వాహనాలను అందుబాటులో ఉంచాలి..
వినియోగదారుడు అభ్యర్థిస్తే ఇసుక సరఫరా చేసేందుకు రీచ్‌ల వద్ద 20 వాహనాల చొప్పున అందుబాటులో ఉంచాలని నిర్దేశించింది. ఇలా రవాణా చేసినందుకు ఎంత వసూలు చేయాలనేది ప్రభుత్వమే నిర్ణయిస్తుందని.. అధిక ధరకు ఇసుక విక్రయిస్తే టన్నుకు 2వేల చొప్పున జరిమానా విధిస్తామని హెచ్చరించింది. కొనుగోలు చేసినవారు అవసరాలకు మించి నిల్వ ఉంచకూడదని, ఇతరులకు విక్రయించకూడదని స్పష్టంచేసింది. వర్షాకాలం కాని సమయంలో మొత్తం రీచ్‌ల్లో 70 శాతం పని చేస్తుండాలని... జులై, ఆగస్టు, సెప్టెంబరు నెలల అవసరాలకు తగినట్లుగా జూన్ చివరి నాటికే నిల్వ చేసుకోవాలని స్పష్టంచేసింది. సంబంధిత వివరాలను గనుల శాఖకు తెలియజేయాలని.. నదుల మధ్యలో ఉండే ఇసుకను తవ్వి తెచ్చే బోట్స్‌మెన్ సొసైటీలకు ఉపాధి చూపాలని నిబంధన విధించింది. లీజుకు సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేయాలని, దానికి బయట తవ్వకాలు చేయకూడదని నిర్దేశించింది. ప్రతి రీచ్‌లో ఇసుక తవ్వకాలు, విక్రయాల వివరాలు రోజూ రికార్డుల్లో నమోదు చేయాలని ఉత్తర్వుల్లో తెలిపింది.
జీపీఎస్ తప్పనిసరి