మంత్రివర్గంలో చోటు దక్కని వైకాపా ఎమ్మెల్యేల బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానును రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ బుజ్జగించారు. ఉదయభాను నివాసంలో గంటకుపైగా మంతనాలు జరిపిన మోపిదేవి.. కేబినెట్ కూర్పులో కొందరు ఆశావహులకు పదవి ఇవ్వలేదన్నారు. 70 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సామాజికవర్గాలకు అవకాశం కల్పించారని తెలిపారు. సీనియార్టీని సీఎం జగన్ గౌరవిస్తారని.., త్వరలో న్యాయం జరుగుతుందని సామినేని ఉదయభానుకు తెలిపారు. కార్యకర్తలందరూ సమన్వయం పాటించాలని సూచించారు. ప్రతి ఎమ్మెల్యేకు మంత్రిగా ప్రజాసేవ చేయాలనే ఉంటుందని అన్నారు.
వారే కారణం: నిత్యం సీఎంవో కార్యాలయం చుట్టూ తిరిగే కృష్ణా జిల్లాకు చెందిన కొంతమంది నేతలు తనకు మంత్రి పదవి రాకుండా చేశారని ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఆరోపించారు. అంతకు ముందు మీడియాతో మాట్లాడిన ఆయన.. మంత్రి పదవి రాకపోవటంతో తన అనుచరులు, కార్యకర్తలు తీవ్ర ఆవేదనలో ఉన్న మాట వాస్తవమేనని స్పష్టం చేశారు. పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉండి, పార్టీ కోసం కృషి చేసిన తనకు మంత్రి పదవి రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పదవి ఉన్నా.., లేకపోయినా పార్టీ కోసం కృషి చేస్తానని తెలిపారు. రాజీనామాలకు సిద్ధపడిన జగ్గయ్యపేట ప్రజాప్రతినిధులను సముదాయించినట్లు తెలిపారు.