Sajjala Ramakrishna Reddy on SSC Results in AP: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం వల్లే పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం తగ్గి ఉండవచ్చని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. దీన్ని తాము పట్టించుకోమన్నారు. ఇంగ్లీష్ మీడియం అమలుతో తొలుత కొన్ని సవాళ్లు, ఇబ్బందులు ఉంటాయని సీఎం కూడా చెప్పారని ఆయన అన్నారు. పిల్లల్లో ఆత్మవిశ్వాసం నింపడం ద్వారా పోటీ పరీక్షల్లో ముందుకెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని.. ఇంగ్లీష్ మీడియం వల్ల దీర్ఘకాలంలో మంచి ఫలితాలు వస్తాయని సజ్జల అన్నారు.
ఈ ఏడాది పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం తగ్గిందనే విమర్శలపై సజ్జల స్పందించారు. 'పరీక్షల్లో మాల్ ప్రాక్టీసులకు తావు లేకుండా కఠినంగా వ్యవహరించడం తప్పా? పారదర్శకంగా పది పరీక్షలు జరిపామా లేదా అనేదే ప్రామాణికం. నారాయణ, చైతన్య, కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు కాన్సర్లా తగులుకొని పరీక్షలకే ఆర్థం మార్చేశాయి. గతంలో ఎడాపెడా మాల్ ప్రాక్టీసులు చేసి 90 శాతం పైగా ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది మాల్ ప్రాక్టీస్‌కు బ్రేక్ పడటంతో పదిలో ఉత్తీర్ణత శాతం తగ్గింది.