ఎలాంటి చర్యలూ చేపట్టం: పెద్దిరెడ్డి
రాష్ట్ర ఎన్నికల కమిషనరు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీకాలం మార్చి 31 వరకేనని, ఆయన ఇచ్చిన అభిశంసన ఉత్తర్వులను వెనక్కి పంపుతున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ‘మా శాఖలో పనిచేస్తున్న ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్‌లపై ఇచ్చిన 9 పేజీల అభిశంసన ఉత్తర్వులను తిరిగి ఎస్‌ఈసీకే పంపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోం, బదిలీలు చేయబోం’ అని తేల్చిచెప్పారు. నష్టపోయిన కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులకు మద్దతిస్తామని చెప్పారు. తిరుపతిలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. త్వరలో ఉద్యోగ విరమణ చేయబోతున్న నిమ్మగడ్డ.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నామినేషన్లకు అవసరమైన పత్రాలన్నీ ఆన్‌లైన్‌లో జారీ చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. గ్రామీణ ప్రజల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పి వారిలో సఖ్యత, సోదరభావం ఉండాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేయడంలో రాజకీయం ఎక్కడ ఉందో చెప్పాలని ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్‌ను ప్రశ్నించారు. ఏకగ్రీవమయ్యే పంచాయతీలకు నజరానా ప్రకటించడం దశాబ్దాలుగా ఉందన్నారు. ఏకగ్రీవాలు ఎక్కువైతే వాటిని వ్యతిరేకిస్తామన్నట్లుగా కమిషనరు చెప్పడం రాజకీయం కాదా అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు ఫలానా పార్టీకి అనుకూలంగా, కొన్ని పార్టీలకు వ్యతిరేకంగా జరుగుతాయనే అభిప్రాయాన్ని కలిగించేలా మీడియా సమావేశంలో ఎన్నికల కమిషనరు మాట్లాడటం ఎంతవరకూ సమంజసమని మంత్రి ప్రశ్నించారు. పంచాయతీరాజ్ చట్టానికి విరుద్ధంగా ఎన్నికల కమిషనరు వ్యవహరించడం వల్లే రాష్ట్రంలో లక్షలాది మంది ఓటు హక్కును కోల్పోయారని పెద్దిరెడ్డి ఆరోపించారు. మార్చిలో పదవీవిరమణ చేయాల్సి ఉందన్న హడావుడిలో ఎన్నికలకు రమేశ్ కుమార్ నోటిఫికేషన్ ఇవ్వడంతో లక్షలాది మంది ఓటు హక్కును కోల్పోయారని ఆరోపించారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను కారణంగా చూపడం సమంజసం కాదని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.
ఓటరు జాబితా విషయంలో భయంతోనే: సజ్జల
‘పంచాయతీ ఎన్నికల్లో ఓటర్ల జాబితా విషయంలో హైకోర్టులో ఉన్న కేసులో తాను దొరికిపోతానన్న భయంతోనే ఆ తప్పును పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి, కమిషనర్లపై మోపేందుకు వారిద్దరినీ బాధ్యులను చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనరు రమేశ్ కుమార్ వారిపై చర్యలకు దిగారు’ అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం ఆయన వైకాపా కేంద్ర కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. ‘ఏ ఏడాది పంచాయతీ ఎన్నికలు జరిగితే ఆ సంవత్సరం జనవరి 1న ఉన్న ఓటరు జాబితానే ప్రాతిపదికగా తీసుకోవాలని పంచాయతీరాజ్ చట్టంలో ఉంది. ఈ నెల 16న కేంద్ర ఎన్నికల సంఘం తుది ఓటరు జాబితాను వెలువరించింది. ఆ జాబితాను తీసుకొని క్షేత్రస్థాయికి పంపి పంచాయతీ ఎన్నికలకు ఓటరు జాబితాను సిద్ధం చేసేందుకు 30-45 రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. ఇది జరిగేలోపు ఆయన పదవీకాలం అయిపోతుంది. అందువల్ల 2019 ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకోవాలని ఎస్‌ఈసీ తీసుకున్న నిర్ణయం కారణంగా ఓటు హక్కు కోల్పోయిన బాధితులు కోర్టుకు వెళ్లారు. దీంతో తప్పు తన మీదకు వస్తుందన్న భయంతో ఓటరు జాబితాలను సిద్ధం చేయడంలో పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ విఫలమయ్యారని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రాసిన రాతలు, వాడిన భాష అసభ్యతకు తార్కాణంగా కనిపిస్తోంది. ఆయన అహంభావాన్ని సూచిస్తున్నాయి’ అని సజ్జల మండిపడ్డారు. ‘గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్‌లను బదిలీచేసి వారి స్థానంలో కొత్తవారిని నియమించాలని ఈ నెల 25న ఎన్నికల కమిషనరు ప్రభుత్వానికి లేఖ పంపారు. ప్రభుత్వం వారిద్దరినీ బదిలీ చేస్తూ వారి స్థానంలో నియమించేందుకు ముగ్గురి పేర్లతో జాబితాను ఎస్‌ఈసీకి పంపింది. అయితే మాకు సంబంధం లేదు.. కావాలంటే మీరు బదిలీ చేసుకోండి అని ఎస్‌ఈసీ మరో లేఖ పంపారు. ద్వివేది, గిరిజా శంకర్ బదిలీకి సిఫార్సు చేస్తూ మొదట రాసిన లేఖకు ఎస్‌ఈసీ ఎందుకు కట్టుబడి ఉండలేదు?’ అని సజ్జల ప్రశ్నించారు. ఎస్‌ఈసీ రాసిన లేఖల ప్రతులను విడుదల చేశారు.