చంద్రబాబును అధికారంలో కూర్చబెట్టడమే జనసేన అధినేత పవన్ లక్ష్యమని.., అందుకోసం పొత్తుల గురించి వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఒక విధానమంటూ లేని జనసేన పార్టీ అధినేత.. వైకాపా వ్యతిరేక ఓటును చీలనివ్వబోనని చెబుతూ పొత్తులపై మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని గత ఎన్నికల ముందు ఆరోపించిన పవన్.. గత ఎన్నికల్లో ఓట్లు పక్కకు పోకుండా డమ్మీలను పెట్టి తెలుగుదేశానికి సహకరించారని ఆరోపించారు.
జనసేన-తెలుగు దేశం పొత్తులోనే ఉన్నాయన్న సజ్జల.. గతం నుంచి కలిసే సంసారం చేస్తున్నారన్నారు. చంద్రబాబు స్క్రీన్ ప్లే, డైరెక్షన్లోనే పవన్ నడుస్తున్నారని.., గత ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినా దింపుడు కళ్లెం ఆశలతో పొత్తుల ప్రయత్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బరితెగింపు, ప్రజలంటే లెక్కలేని తనంతో వీరంతా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పొత్తులపై అందరూ కలసి జనాన్ని ఫూల్స్ చేస్తున్నారని.., దీన్ని ప్రజలు గమనించాలన్నారు.
కాంగ్రెస్ జాతీయ పార్టీ కాబట్టే గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారన్నారు. వైఎస్ తనకు ఇష్టం లేకపోయినా.. అధిష్ఠానం ఒత్తిళ్ల వల్ల అప్పట్లో పొత్తులు పెట్టుకున్నట్లు చెప్పారు. ప్రజల మద్దతుతో సీఎం జగన్ ఒంటరిగానే పోటీ చేస్తారని సజ్జల వెల్లడించారు. రెండేళ్లలో ఎన్నికలు రాబోతున్నాయన్న సజ్జల.. ఎన్నికల్లో విజయం సాధించటమే లక్ష్యంగా ఎల్లుండి (బుధవారం) నుంచి గడప గడపకు వైఎస్ఆర్సీపీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు.