బీసీలంతా వైకాపా వెంటే ఉన్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తమ కేబినెట్‌లో 68 శాతం వెనుకబడిన వర్గాలవారే ఉన్నారని తెలిపారు. తమ పార్టీ ఎప్పుడూ రాజకీయ సాధికారత దిశగా అడుగులు వేస్తోందని చెప్పారు.
బీసీలంతా వైకాపా వెంటే ఉన్నారు
By
Published : Apr 10, 2022, 9:13 PM IST
వైకాపా ఎప్పుడూ రాజకీయ సాధికారత దిశగా అడుగులు వేస్తూనే ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. బీసీలంతా వైకాపా వెంటే ఉన్నారని చెప్పారు. కొత్త కేబినెట్ కూర్పులో సామాజిక సమీకరణలపై వివరించారు. తమ కేబినెట్‌లో దాదాపు 68 శాతం మంది బీసీలు ఉన్నారని వెల్లడించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకు 17 మంది మంత్రి పదవులు ఇచ్చామని తెలిపారు. ట్రస్టులు, నామినేటెడ్, ఇతర సంస్థల్లో వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేశామని తెలిపారు. తమ ప్రభుత్వంలో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు వివరించారు. కేబినెట్‌లో నలుగురు మహిళలకు చోటు కల్పించామని సజ్జల వెల్లడించారు.
"మా మంత్రివర్గ జాబితాను చంద్రబాబు పరిశీలించాలి. తెదేపా ప్రభుత్వంలో 25 మంది మంత్రుల్లో 55 శాతం ఓసీలు ఉన్నారు. 2014 నుంచి 2018 వరకు ఎస్టీలు, మైనార్టీలకు ప్రాతినిధ్యం లేదు. మా కేబినెట్‌లో 68 శాతం వెనుకబడిన వర్గాలే ఉన్నారు. మా పరిపాలన చూసి బీసీలంతా వైకాపా వెంటే ఉన్నారు." - సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు
25 మందితో కొత్త కేబినెట్:రాష్ట్ర కొత్త కేబినెట్ ఖరారైంది. ఎన్నో కసరత్తులు.. మరెన్నో సమీకరణాలు.. ఇంకెన్నో కూడికలు, ఎన్నెన్నో తీసివేతల తర్వాత నూతన మంత్రివర్గం కూర్పు ఫైనల్ అయ్యింది. మొత్తం 25 మందిని కేబినెట్లోకి తీసుకున్నారు ముఖ్యమంత్రి జగన్. నూతన మంత్రివర్గం రేపు (సోమవారం) ఉదయం కొలువుదీరనుంది. గడిచిన మూడురోజులుగా మంత్రివర్గం కూర్పుపై ఎన్నో మంతనాలు సాగించిన సీఎం.. ఎట్టకేలకు ఆదివారం సాయంత్రానికి తుదిజాబితాను ఖరారు చేశారు. రేపు ఉదయం 11.31 గంటలకు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం పక్కన ఉన్న పార్కింగ్ స్థలంలో.. మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కాగా.. మంత్రుల పేర్లను ఖరారు చేసి.. ఈ జాబితాను రాజ్‌భవన్‌కు పంపించారు. గవర్నర్ ఆమోదించారు.