Chalo Vijayawada News: తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్తో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ సమావేశమయ్యారు. మెరుగైన పీఆర్సీ కావాలంటూ ఉద్యోగులు నిర్వహించిన 'చలో విజయవాడ' కార్యక్రమం విజయవంతం కావటంపై చర్చించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల చలో విజయవాడపై సీఎం జగన్ ఆరా తీశారు.
ఉద్యోగుల పీఆర్సీ ఆందోళనలపై సీఎస్ సమీర్ శర్మ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు సీఎస్ మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు.
'చలో విజయవాడ' విజయవంతం..
ఉద్యోగులు నిర్వహించిన 'చలో విజయవాడ' కార్యక్రమం విజయవంతమైంది. ప్రభుత్వం కల్పించిన అడ్డంకులను అధిగమించి వేలాదిగా ఉద్యోగులు విజయవాడకు తరలివచ్చారు. ఉద్యోగుల ఆకాంక్షల ముందు ప్రభుత్వ ఆంక్షలు చిన్నబోయాయి. పీఆర్సీ సాధించాలన్న లక్ష్యం ముందు పోలీసుల నిర్భంధం పని చేయలేదు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకూ అన్నిదారులు విజయవాడ వైపే కదిలాయి. డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వంపై పూరించిన సమరశంఖం దుర్గమ్మ సన్నిధిలో ప్రతిధ్వనించింది. చలో విజయవాడ కోసం తరలివచ్చిన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులతో ఉద్యమాల గడ్డ బెజవాడ దద్దరిల్లింది. బీఆర్టీఎస్ రహదారి వేదికగా ఉద్యోగులు రణభేరి మోగించారు. డిమాండ్లు నెరవేర్చే వరకూ ఉద్యమం ఆగబోదని తేల్చి చెప్పారు. ఈనెల 6 అర్థరాత్రి నుంచి సమ్మె తప్పదని.. అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి
ఉద్యోగుల మిలియన్ మార్చ్.. పని చేయని పోలీసు ఆంక్షలు