‘అమరరాజా బ్యాటరీస్ సంస్థ పోవడం కాదు.. ప్రభుత్వమే పొమ్మంటోంది. వాతావరణాన్ని విషతుల్యం చేస్తూ మనుషుల ప్రాణాలకు హాని కలిగించే విష కణాలు అక్కడ ఉన్నాయని కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)తోపాటు హైకోర్టు కూడా ధ్రువీకరించింది’ అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన వైకాపా కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘ప్రజల ప్రాణాలకు నష్టం కలగకుండా తగిన చర్యలు తీసుకుని పరిశ్రమలను నడిపించుకోవాలని చెబుతున్నాం. అమరరాజా సంస్థకూ అలాగే ప్రభుత్వం సమయమిచ్చింది. కాలుష్య నియంత్రణ చేయలేకపోతే సంస్థ కంటే మనుషుల ప్రాణాలకే ప్రాధాన్యమివ్వాలని హైకోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది.
ఇది అమరరాజాపై కోపం కాదు. జనావాసాలు పెరుగుతున్నప్పుడు పరిశ్రమలపై కచ్చితంగా పునఃపరిశీలిస్తాం. ముఖ్యమంత్రి జగన్ సంకుచితంగా ఆలోచించరు. అలాంటి పరిస్థితుల్లో నాదో, వైవీ సుబ్బారెడ్డిదో ఇంకొకరి పరిశ్రమో ఉన్నా సీఎం అలాగే వ్యవహరిస్తారు. అక్కడ పర్యావరణం దెబ్బతినడమే కాదు మనుషుల ప్రాణాలూ పోయేలా ఉన్నాయి. 55 మందికి రక్త పరీక్షలు చేస్తే 41 మందిలో సీసం ఉన్నట్లు తేలింది. వీటిని హైకోర్టు అంగీకరించింది. పరిశ్రమలు రావాలనే ప్రభుత్వం కోరుకుంటోంది. కానీ, పర్యావరణానికి, ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించకూడదు. ఉపాధి పోతుందని అంటున్నారు. ప్రజల ప్రాణాలకు హాని కలిగించకుండా కుటుంబాలను నిలబెట్టే ఉపాధి కల్పించేలా ఉండాలి. పర్యావరణ అనుకూల పరిశ్రమలు తెద్దామనే ధోరణిలో సీఎం ఉన్నారు. గల్లా రామచంద్ర నాయుడు, గల్లా జయదేవ్ తెదేపా వారని.. చర్యలు తీసుకునే ఆలోచన సీఎం జగన్ చేయరు. మీవాళ్ల పరిశ్రమలైతే వాటిలో ఏ అక్రమాలు, తప్పులున్నా ప్రభుత్వం ప్రశ్నించకూడదా? ఈ బ్లాక్‌మెయిల్ ఏంటి?’ అని ప్రశ్నించారు.
అదే మాటను రాష్ట్ర భాజపా నేతలు చెప్పాలి