ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'వ్యవసాయ అనుబంధ బిల్లులు రైతు వ్యతిరేకం' - వ్యవసాయ బిల్లులపై శైలజానాథ్ కామెంట్స్

వ్యవసాయ అనుబంధ బిల్లులు రైతు వ్యతిరేకమని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ మండిపడ్డారు. బిల్లుల వల్ల దేశంలో 90 శాతం ఉన్న చిన్న కమతాల రైతులు తీవ్రంగా దెబ్బతింటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లులను వ్యతిరేకిస్తూ... నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు స్పష్టం చేశారు.

వ్యవసాయ అనుబంధ బిల్లులు రైతు వ్యతిరేకం
వ్యవసాయ అనుబంధ బిల్లులు రైతు వ్యతిరేకం

By

Published : Sep 24, 2020, 8:49 PM IST

కేంద్రం పార్లమెంట్​లో ఆమోదింపజేసిన వ్యవసాయ అనుబంధ బిల్లులు రైతు వ్యతిరేకమని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఈ బిల్లులు చట్టాలైతే... రైతులను కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టడమేనని విమర్శించారు. ఎన్డీయే భాగస్వామి అకాళీదళ్, భాజపా మెంటర్ ఆర్ఎస్ఎస్ కూడా ఈ బిల్లులను వ్యతిరేకించడం గమనార్హమన్నారు. బిల్లుల వల్ల దేశంలో 90 శాతం ఉన్న చిన్న కమతాల రైతులు తీవ్రంగా దెబ్బతింటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పండించిన పంటకు ధరలు డిమాండ్ చేయలేని స్థితిలో ఉన్న రైతు... రేపు పంటను అయిన కాడికి అమ్ముకునే దుర్భర స్థితిలోకి నెట్టబడతారన్నారు. రాష్ట్రాలు మార్కెట్ సెస్ కోల్పోయి మద్దతు ధర ఇచ్చే స్థితి ఉండదని పేర్కొన్నారు.

ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చిందని... బిల్లులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈనెల 26న సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 28న రాష్ట్ర కార్యాలయం వద్ద నిరసన... మహాత్మా గాంధీ విగ్రహం వరకూ పాదయాత్ర, విజ్ఞాపనపత్రం సమర్పణ కార్యక్రమం ఉంటుందన్నారు. అక్టోబర్ 2న 'రైతు-రైతు కూలీని రక్షించు' అనే నినాదంతో ప్రతి అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రంలో ధర్నా చేయనున్నట్లు వివరించారు. అక్టోబర్ 10న రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్రవ్యాప్త రైతు సమ్మేళన సమావేశాలు నిర్వహిస్తామన్నారు. అక్టోబర్ 2 నుంచి 31 వరకు 2 కోట్ల మంది రైతులు, రైతు కూలీలు, మండీ కూలీలు,మండీ వర్తకుల సంతకాల సేకరణ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details