ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Thagulla Gopal: ఈ పురస్కారం పాలమూరు మట్టికి అంకితం: తగుళ్ల గోపాల్​ - sahitya akademi award

Thagulla Gopal: పశువులను కాస్తూ చదువు మానేద్దామనుకున్న వ్యక్తి.. గురువు ప్రోత్సాహంతో పేదరికాన్ని జయించాడు.. అక్షర శిఖరాలను అధిరోహించాడు. "దండకడియం" అనే కవితా సంకలనం రాసి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం అందుకున్నాడు. ఆ మట్టిలో మాణిక్యమే తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం కలకొండ గ్రామానికి చెందిన తగుళ్ల గోపాల్. ఆయన కవితా ప్రయాణంపై ప్రత్యేక కథనం.

sahitya akademi yuva puraskar
తగుళ్ల గోపాల్​

By

Published : Dec 31, 2021, 10:41 PM IST

కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహిత తగుళ్ల గోపాల్​

Thagulla Gopal: "దండ కడియం" కవితా సంకలనానికి ప్రకటించిన కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం పాలమూరు మట్టికి, తాను పుట్టిన ఊరికి అంకితమని అవార్డు గ్రహీత తగుళ్ల గోపాల్ అన్నారు. పురస్కారం దక్కిన సందర్భంగా ఆయన ఈటీవీ భారత్​తో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం కలకొండ గ్రామానికి చెందిన తగుళ్ల గోపాల్ 1992లో కృష్ణయ్య, ఎల్లమ్మ దంపతులకు జన్మించారు. ఐదో తరగతిలో చదువు మానేసి పశువులు కాస్తున్న తరుణంలో అదే గ్రామానికి చెందిన రాజవర్ధన్ రెడ్డి అనే ఉపాధ్యాయుడు గోపాల్ తల్లిదండ్రులను ఒప్పించి బడి మానివేయకుండా చూశారు. ఉదయం సాయంత్రం పశువులు కాస్తూనే ఆరేడు తరగతులు పూర్తి చేశారు. 8వ తరగతి నుంచి పదో తరగతి వరకు నాగార్జున సాగర్ బీసీ హాస్టల్​లో ఉండి చదువుకున్నారు.

కవితా ప్రయాణం.. అలా మొదలు..
చిన్నప్పటి నుంచి ఉపాధ్యాయుడు కావాలనుకున్న గోపాల్ డీఎడ్ చేసి 2012లో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా నియమితులయ్యారు. ప్రస్తుతం వెల్దండ మండలం అజిలాపూర్​లో ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా సేవలందిస్తున్నారు. హైదరాబాద్​లో ఓ సదస్సులో నారాయణశర్మ రాసిన 'అస్థిత్వ పుష్పాలు' పుస్తకం చదివాక గోపాల్ నానీలు రాయడం ప్రారంభించారు. సమాజంలో అసమానతలు, పేదరికంపై సరళమైన భాషలో కవిత్వం రాయడం ఆయన శైలి. 2016లో తీరొక్కపువ్వు నానీల సంపుటి వెలువరించారు. గ్రామీణుల జీవితాలు, వృత్తులు, పేదలు జీవితంలో ఎదుర్కొనే ఒడిదుడుకులను దండకడియంలో పొందుపరిచారు.

పేరు తెచ్చిన కవితలు..
అమ్మపోసిన గంజినీరుపై రాసిన గంజి, పశువుల కాసిన చిన్ననాటి జ్ఞాపకాలతో రాసిన 'ముల్లుపాఠం' తదితర కవితలు గోపాల్​కు పేరుతెచ్చాయి. దండ కడియం కవితా సంపుటికి 2019లో పాలమూరు సాహితి పురస్కారం లభించింది. ఈ ఏడాది తెలంగాణ సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి అవార్డు అందుకున్నారు. 8ఏళ్లుగా ఊళ్లోని పిల్లలకు ఉచితంగా ట్యూషన్ చెబుతూ సేవ చేస్తున్నారు.

'ఈ పురస్కారం పాలమూరు మట్టికి, కలకొండ గ్రామానికి, ఇలాంటి గ్రామాలన్నింటికీ దక్కిన గౌరవంగా భావిస్తున్నా. దండకడియం కవితా సంపుటిని తన తాత, ఆయనలాంటి ఎంతోమంది కష్టాలను గమనించి రాశా. గ్రామంలో ఉండే వివిధ వృత్తుల వాళ్ల గురించి, పేదల జీవితంలో ఎదుర్కొనే ఒడుదొడుకులను పొందుపరిచా. పీహెచ్​డీ చేయడమనేది నా లక్ష్యం. సాహిత్యం రాయడం నాకు చాలా ఇష్టం. శ్రమిస్తూ పోతే గౌరవం అదే దక్కుతుందని నేను భావిస్తా. అందుకే మారుమూల గ్రామంలో ఉన్న నాకు ఈ గౌరవం దక్కింది.' -తగుళ్ల గోపాల్​, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం గ్రహీత

ఇదీ చదవండి:

Somu On Liquor Prices: రూ.50 కే చీప్ లిక్కర్ అమ్మితే కుటుంబానికి రూ.2 లక్షలు మిగులుతాయి: సోము

ABOUT THE AUTHOR

...view details