అనారోగ్య సమస్యల కారణంగా మెడికల్ అన్ఫిట్ అయిన తమ ఉద్యోగాలను.. పిల్లలకు ఇవ్వాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ అన్ఫిట్ ఆర్టీసీ ఉద్యోగులు విజయవాడలో సమావేశమయ్యారు. ఇప్పటికే తమ సమస్యను పలుమార్లు మంత్రుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని వాపోయారు.
చాలీచాలని పింఛన్లతో బ్రతకడం కష్టంగా మారిందని..తమ ఉద్యోగాలను పిల్లలకు ఇచ్చి తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీలో ఉన్న సర్క్యూలర్ పీడీ 19/2015 ద్వారా.. ఈ వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు. సమస్యను పరిష్కరించాలంటూ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని, ఉప ముఖ్యమంత్రి, మంత్రులను, అన్ని ఉద్యోగ సంఘాలను కలిసినా.. పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారే తప్ప పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించి.. తమ సమస్యను పరిష్కరించాలని ఆర్టీసీ మెడికల్ అన్ఫిట్ ఉద్యోగుల సంఘం నాయకులు సుగుణాకర్ కోరారు.