RTC EMPLOYEES: చర్చలు సఫలం.. సమ్మెను విరమిస్తున్నాం: ఆర్టీసీ ఐకాస - apsrtc employees strike news
08:33 February 06
సమ్మెపై ప్రకటన విడుదల చేసిన 14 సంఘాలతో కూడిన ఐకాస
apsrtc employees strike: రేపట్నుంచి రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన సమ్మెను విరమించినట్లు ఆర్టీసీ ఐకాస ప్రకటించింది. పీఆర్సీ సాధన సమితితో ప్రభుత్వ చర్చలు సఫలమైనందున.. సమ్మెను విరమిస్తున్నట్లు నేతలు ప్రకటించారు. ఈ మేరకు 14 సంఘాలతో కూడిన ఆర్టీసీ ఐకాస ప్రకటన విడుదల చేసింది. ఇవాళ నల్లబ్యాడ్జిలు ధరించడం, ధర్నాలను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. ఆర్టీసీ ఎండీకి ఇచ్చిన 45 డిమాండ్ల పరిష్కారానికి కృషిచేస్తామని తెలిపింది. త్వరలో ఆర్టీసీ జేఏసీ కమిటీ సమావేశం నిర్వహించి....ఉద్యోగుల డిమాండ్లు, ప్రభుత్వ జీవోలపై భేటీలో చర్చిస్తామని ప్రకటనలో తెలిపారు. సమావేశం తర్వాత జేఏసీ చేపట్టే తదుపరి కార్యక్రమాలు తెలియజేస్తామని ఐకాస నేతలు వెల్లడించారు.
apsrtc employees strike: ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేయాలని గతంలో ఆర్టీసీ ఉద్యోగులు నిర్ణయించారు. అన్ని డిపోల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక కీలక నిర్ణయం తీసుకుంది. సమ్మె సహా భవిష్యత్ పోరాట కార్యాచరణ పటిష్టంగా అమలు చేయాలని సంఘ నేతలు.. ఉద్యోగులకు ఆదేశాలిచ్చారు. పీఆర్సీకి నిరసనగా ఆర్టీసీ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని తీర్మానించారు. అన్ని డిపోల్లో ఉద్యోగులందరూ నల్లబ్యాడ్జీలు ధరించి విధుల్లో పాల్గొనాలని నిర్ణయించారు. టీ, భోజన విరామంలో డిపోల్లో భారీగా ధర్నాలు చేయాలని నిర్ణయించారు. విలీనం అనంతరం ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటోన్న సమస్యలను ధర్నాల్లో చర్చించాలని నిర్ణయించారు. హాజరైన సిబ్బందికి సమ్మె చేయాల్సిన ఆవశ్యకతను వివరించాలన్నారు. యూనియన్ల జెండాలు, బ్యానర్ల స్థానంలో ఏపీపీటీడీ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక బ్యానర్లు మాత్రమే వాడాలని స్పష్టం చేశారు. తాజాగా ప్రభుత్వంతో చర్చలు సఫలమైనందున నేటి అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన సమ్మెను విరమించినట్లు ఆర్టీసీ ఐకాస ప్రకటించింది.
ఇదీ చదవండి:RTC: సమ్మెకు ఆర్టీసీ సంఘాలు సై.. నేడు, రేపు డిపోల వద్ద ధర్నాలు