లాక్‌డౌన్ సమయంలో పోలీసులకు సాయమందించిన ఆర్టీసీ కండక్టర్లు... సరకు రవాణా బుకింగ్ కేంద్రాల్లో ఏజెంట్లుగా మారనున్నారు. అన్‌లాక్‌లో భాగంగా బస్సులు తిరుగుతున్నా.. ఆన్‌లైన్ బుకింగ్‌తో కండక్టర్లు లేకుండానే ప్రయాణాలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో కండక్టర్ల సేవలను లాజిస్టిక్ కేంద్రాల్లో ఏజెంట్లుగా ఉపయోగించుకోవాలని ఆర్టీసీ నిర్ణయించింది.
ప్రత్యేక ఆదాయార్జనలో భాగంగా.. 2017 నుంచే ఆర్టీసీ సరకు రవాణా వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 57 డిపోలు, 2 ప్రధాన బస్ స్టేషన్లలో మ్యాన్‌పవర్, హార్డ్‌వేర్ సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లు, మిగిలిన 71 డిపోల్లో ఏజెంట్లు లాజిస్టిక్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. కాంట్రాక్టర్లు నిర్వహిస్తున్న వాటితో పోల్చితే ఏజెంట్లు నిర్వహిస్తున్న డిపోల్లో తక్కువ ఆదాయం వస్తోందని ఆర్టీసీ గుర్తించింది. ఆలస్యంగా కౌంటర్లు తెరవటం, వేగంగా మూసేయటం, సేవా, నిర్వహణ లోపాల వల్లే బుకింగ్‌లు తగ్గాయని ఆర్టీసీ భావిస్తోంది. స్థానిక డిపో అధికారుల పర్యవేక్షణ లోపమూ మరో కారణమని గుర్తించింది. ఈ పరిస్థితి మార్చాలని భావించిన ఉన్నతాధికారులు... ఏజెంట్ల స్థానంలో కండక్టర్లను నియమించాలని నిర్ణయించారు.