RTC Charges: విద్యుత్ ఛార్జీల పెంపుతో నడ్డివిరిగిన రాష్ట్ర ప్రజలపై.. త్వరలో ఆర్టీసీ టికెట్ ఛార్జీల రూపంలో అదనపు భారం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. డీజిల్ ధరలు నిరంతరం పెరుగుతుండటంతో ఆ భారాన్ని తగ్గించుకోవడానికి ఛార్జీలు పెంచడం ఒక్కటే మార్గమని ఏపీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది. దీంతో ధరల పెంపుపై ప్రతిపాదనలను ఉన్నతాధికారులు త్వరలో సీఎం ముందుకు తీసుకెళ్లనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీనికి సీఎం పచ్చజెండా ఊపితే ఆర్టీసీ ఛార్జీల వడ్డన మొదలయ్యే వీలుందని సమాచారం.
ఆర్టీసీ ఏటా సగటున 29-30 కోట్ల లీటర్ల డీజిల్ వినియోగిస్తోంది. గతంలో లీటరు రూ.70కి చేరడంతో 2019లో ఛార్జీలు పెంచారు. ఇప్పుడు లీటర్ డీజిల్ రూ.102కి చేరింది. కొద్ది రోజులుగా నిరంతరం ధర పెరుగుతూనే ఉంది. దీంతో డీజిల్ రూపంలోనే ఏటా రూ.900-1,000 కోట్ల మేర భారం భరించాల్సి వస్తోందని అధికారులు లెక్కలు వేశారు.