ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పల్నాడు కోసం రూ.6,020 కోట్ల పథకం

పల్నాడు ప్రాంత కరవు నివారణ కోసం రూ.6,020 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన పథకానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. 2 ప్యాకేజీల పనులు కొనసాగించేందుకు నవయుగ-ఆర్‌వీఆర్‌ సంస్థ, మేఘా ఇంజినీరింగ్‌ కంపెనీలను అనుమతిస్తూ జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ ఉత్తర్వులు ఇచ్చారు.

పల్నాడు కోసం రూ.6,020 కోట్ల పథకం
పల్నాడు కోసం రూ.6,020 కోట్ల పథకం

By

Published : Apr 23, 2020, 6:22 AM IST

పల్నాడు ప్రాంత కరవు నివారణ కోసం రూ.6,020 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన పథకానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. గతంలో గోదావరి-పెన్నా తొలిదశ పేరుతో ఈ పథకాన్ని 2 ప్యాకేజీలుగా విడగొట్టి టెండర్లు పిలిచారు. నవయుగ-ఆర్‌వీఆర్‌ సంస్థ, మేఘా ఇంజినీరింగ్‌ కంపెనీలు ఈ పనులను దక్కించుకున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ పనులను నిలిపివేశారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 9.61లక్షల ఎకరాల స్థిరీకరణకు ఈ పథకంవల్ల ప్రయోజనం ఉందని, కరవు నివారణకు ఉపకరిస్తుందనే ఉద్దేశంతో తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డి వద్ద జరిగిన సమావేశంలో పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు 2 ప్యాకేజీల పనులు కొనసాగించేందుకు పై కంపెనీలను అనుమతిస్తూ జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ ఉత్తర్వులు ఇచ్చారు. గోదావరి బనకచర్ల పెన్నా అనుసంధాన ప్రాజెక్టు చేపట్టేందుకు ప్రభుత్వం ఇప్పటికే వ్యాప్కోస్‌కు పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదికను తయారు చేసే బాధ్యతను అప్పచెప్పింది. గోదావరి వరద జలాలను తరలించే ఆ ప్రాజెక్టు విడిగా చేపడుతున్నందున ప్రస్తుత ప్రాజెక్టుకు వైఎస్సార్‌ పల్నాడు కరవు నివారణ పథకంగా దీని పేరు మార్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. వ్యాప్కోస్‌ నివేదిక తర్వాత గోదావరి బనకచర్ల జలాల మళ్లింపు మార్గంలో ప్రస్తుత ప్రాజెక్టు ఉపకరిస్తే దీన్ని ఉపయోగించుకోవడమో లేదా సమాంతరంగా ఆ పనులు చేపట్టడమో చూడవచ్చనే నిర్ణయానికి వచ్చారు.

ప్యాకేజీ 1:మేఘా ఇంజినీరింగు కంపెనీ- రూ.2,281.29 కోట్ల ఒప్పంద విలువ

ప్యాకేజీ 2:నవయుగ-ఆర్‌వీఆర్‌ సంయుక్తం- రూ.2655.89 కోట్ల ఒప్పంద విలువ

120 వరద రోజుల్లో 73 టీఎంసీలు

ఈ పథకంలో భాగంగా గోదావరి వరద జలాలను 120 రోజుల్లో 73 టీఎంసీలు నాగార్జున సాగర్‌ కుడి కాలువకు తరలిస్తారు. గోదావరి నుంచి పట్టిసీమ, చింతలపూడి పథకాల ద్వారా మళ్లిస్తున్న నీటిలో కృష్ణా డెల్టా అవసరాలు పోను మిగిలిన వాటిలో 7,000 క్యూసెక్కులు రోజుకు ఎత్తిపోస్తూ సాగర్‌ కుడి కాలువకు తీసుకువెళ్తారు.

* ప్రకాశం బ్యారేజి వెనుక వరకు ఉన్న నీటిని గుంటూరు జిల్లా హరిశ్చంద్రపురం నుంచి ఎత్తిపోస్తూ సాగర్‌ కుడి కాలువకు తీసుకువెళ్తారు.

* ఈ నీటిని అయిదు దశల్లో పంపుహౌస్‌లు ఏర్పాటు చేసి 10.25 కిలోమీటర్లు వరకూ పైపుల ద్వారా.. 56.35 కి.మీ గ్రావిటీ కాలువ ద్వారా తీసుకువెళ్లి గుంటూరు జిల్లా నకరికల్లు వద్ద సాగర్‌ కుడి కాలువలో కలుపుతారు. సాగర్‌ కుడి కాలువ ఆయకట్టు అవసరాలు తీర్చేందుకు గోదావరి వరద జలాలు ఉపకరించేలా ఈ ప్రాజెక్టు తోడ్పడుతుంది.

* ఇప్పటికే ఈ ప్రాజెక్టు పంపుల కోసం, ఇతరత్రా అవసరాల కోసం సంబంధిత కంపెనీలకు ఆర్డర్లు ఇవ్వడమూ పూర్తయిందని సమాచారం.

ఇదీచూడండి:డెల్టాకు సాగునీటి గండం

ABOUT THE AUTHOR

...view details