విజయవాడ నగరపాలక సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో మంజూరు చేసిన రూ.100 కోట్ల ప్రత్యేక నిధులను 2020-21 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో ప్రస్తుతం పొందుపరుస్తూ మున్సిపల్ ఎడ్మినిస్ట్రేషన్, అర్బన్ డవలప్‌మెంట్ విభాగం బుధవారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధుల కింద ఇప్పటికే నగరపాలక సంస్థకు రెండు దశల్లో రూ.50 కోట్లు, రూ.100 కోట్ల చొప్పున రూ.150 కోట్లు మంజూరు చేయగా, ఆర్థిక విభాగం అందుకు అనువైన ఆదేశాలు సైతం జారీ చేసింది.
అందులో రూ.50 కోట్లను మాత్రమే ప్రభుత్వం బడ్జెట్‌లో పొందుపర్చగా, మిలిగిన రూ.100 కోట్లు మాత్రం ప్రభుత్వం బడ్జెట్‌లో చేర్చలేదు. దీంతో ఆర్థిక విభాగం ఆమోదించినా, నగరపాలక సంస్థకు మాత్రం ప్రస్తుతం తగిన ఆర్థిక ప్రయోజనం దక్కలేదు. దీంతో నగరపాలక సంస్థ అధికారులు ప్రభుత్వానికి తాజాగా లేఖ రాసి సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తెచ్చారు. సంబంధిత రూ.100 కోట్లను నూతన బడ్జెట్‌లో పొందుపర్చడం ద్వారా నగరపాలక సంస్థకు ఆర్థిక ప్రయోజనం కల్పించాలని కోరారు. ఈ మేరకు స్పందించిన మున్సిపల్ ఎడ్మినిస్ట్రేషన్, ప్రభుత్వం ఆర్థిక శాఖ ద్వారా ఇప్పటికే మంజూరు చేసిన ఆయా నిధులను ప్రస్తుతం బడ్జెట్ కింద పొందుపరుస్తూ మున్సిపల్ ఎడ్మినిస్ట్రేషన్ ద్వారా ప్రస్తుతం ఉత్తర్వులు జారీ చేసింది.