ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఖాళీ పోస్టులు లక్షల్లో ఉంటే.. ఉద్యోగాల భర్తీ మాత్రం వందల్లోనా అంటూ యువజన సంఘాల నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ను పూర్తి స్థాయిలో మార్పులు చేసి.. అన్ని శాఖల్లోని ఖాళీ పోస్టులతో కొత్త క్యాలెండర్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ లెక్కల ప్రకారం, 2 లక్షల 36 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే.. కేవలం 10 వేల పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. కోటి ఆశలతో జాబ్ క్యాలెండరు కోసం ఎదురు చూసిన నిరుద్యోగ యువతను ప్రభుత్వం పూర్తిగా నిరుత్సాహ పరిచిందన్నారు. ఇప్పటికే వయోభారంతో ఉద్యోగం లేక తల్లిదండ్రులపై ఆధారపడిన నిరుద్యోగులకు భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు.