Round Table on Polavaram issues: రాష్ట్ర ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టు పూర్తిపై చిత్తశుద్ధి కొరవడిందని.. ముంపు ప్రాంత బాధితులకు నష్టపరిహారం ఇప్పించే విషయంలో ఆలస్యం చేస్తోందని రాజకీయపక్షాల నేతలు, నిర్వాసితులు ఆరోపించారు. జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పోలవరం గురించి.. నీతిఅయోగ్‌లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ప్రభుత్వ వైఖరి తెలియజేస్తోందని విమర్శించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచే రప్పించాలని... త్వరలో అన్ని రాజకీయ పక్షాలు, రైతు సంఘాలు పోలవరం ప్రాజెక్టు, ముంపు ప్రాంతాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను నేరుగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. "పోలవరం ప్రాజెక్టు నిర్మాణం- నిర్వాసితుల సమస్యల పరిష్కారం" అంశంపై విజయవాడ దాసరిభవన్‌లో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో తీర్మానించారు.
'పోలవరం పునరావాస ప్యాకేజీ గురించి జగన్.. మోదీని ఎందుకు అడగలేదు' - round table on polavaram issues
Round Table meeting on Polavaram: నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లిన సీఎం జగన్ పోలవరం పునరావాస ప్యాకేజీ గురించి ప్రధానిని ఎందుకు అడగలేదని.. వామపక్షాలు, నిర్వాసితులు ప్రశ్నించారు. 'పోలవరం నిర్మాణం-నిర్వాసితుల సమస్యల పరిష్కారం' అనే అంశంపై విజయవాడ దాసరిభవన్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు.వరదల సమయంలో.. ఏపీ ప్రభుత్వం సరైన సౌకర్యాలు కల్పించకపోవడం వల్లే నిర్వాసితులు తమను తెలంగాణలో కలపాలనే డిమాండ్ తెరపైకి తెచ్చారని చెప్పారు.
గోదావరికి ఊహించని రీతిలో వచ్చిన వరదతో ముంపు ప్రాంతాల ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారని.. ఇప్పటికీ అనేక గ్రామాలు వరదలోనే ఉన్నాయని... ప్రాజెక్టు కోసం భూములు త్యాగాలు చేసిన ప్రజల బాగోగులను పాలకులు పట్టించుకోవడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆక్షేపించారు. ప్రాజెక్టు ఎత్తు, కాంటూర్ మార్పు వంటి గందరగోళ అంశాలతో పోలవరం నిర్వాసితుల్లో మరింత ఆందోళన రేకెత్తిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ముంపు మండలాల్లో సరైన మౌలిక సదుపాయాలు సమకూర్చకపోవడం వల్లే నిర్వాసితులు తమను తెలంగాణ రాష్ట్రంలో కలిపాలనే డిమాండ్‌ను తెరమీదకు తీసుకొచ్చారని అన్నారు. పోలవరం ముంపు గ్రామాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి వారికి భరోసా ఇవ్వలేకపోయారని... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోన్న పరిహారాన్ని సైతం వరద బాధితులకు అందించలేకపోయారని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు, కృష్ణా డెల్టా పరిరక్షణ కమిటీ ఛైర్మన్ ఆళ్ల గోపాలకృష్ణ, పోలవరం ముంపు బాధితులు, వివిధ ప్రజాసంఘాల నేతలు, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: