విజయవాడలోని మొగల్రాజపురంలోని సిద్ధార్ధనగర్లో సోమవారం జరిగిన రూ.50 లక్షల దొంగతనం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. బాధితుడు ఆయుర్వేద వైద్యుడు శిరివెళ్ల మురళీధర్ ఆసుపత్రి సిబ్బందే.. ఈ చోరీకి యత్నించినట్టు ప్రాథమికంగా గుర్తించారు. ఈ దొంగతనం కేసులో ఆసుపత్రిలో పీఆర్వోగా పనిచేస్తున్న వ్యక్తితో పాటు.. గతంలో పనిచేసి మానేసిన వ్యక్తులు సూత్రధారులుగా పోలీసులు భావిస్తున్నారు. చోరీకి పాల్పడిన నలుగురికి, వీరికి మధ్య ఒప్పందం ప్రకారం దోచుకున్న నగదును వాటాలుగా పంచుకున్నారు.
ఈ కేసులో ఇప్పటికే ఒకరిని అదుపులోకి తీసుకుని కొంత నగదును రికవరీ చేసినట్టు సమాచారం. నిందితులను పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన ఏడు ప్రత్యేక బృందాలు.. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నాయి. దొంగతనం జరిగిన ఇంటికి వచ్చే మార్గాల్లో ఉన్న అన్ని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. అలాగే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వచ్చిన రోగుల జాబితాను సిద్ధం చేశారు. వీరిలో ఎవరైనా ఈ నేరానికి పాల్పడి ఉంటారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.