ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

MEETING : ముగిసిన సమీక్ష... నోటిఫికేషన్ అమలు కార్యాచరణ పురోగతిపై చర్చ - telugu states war

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల(Krishna River Management Board, Godavari River Management Board) పరిధి గెజిట్ నోటిఫికేషన్ అమలుపై నిర్వహించిన సమీక్ష ముగిసింది. కేంద్ర జలవనరుల విభాగం అదనపు కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీ హైదరాబాద్​లో .. రెండు బోర్డుల ఛైర్మన్లతో భేటీ అయ్యారు. నోటిఫికేషన్ అమలు కార్యాచరణ పురోగతిపై ఈ సమీక్షలో చర్చించారు.

కేంద్ర జలశక్తిశాఖతో ముగిసిన కేఆర్​ఎంబీ, జీఆర్​ఎంబీ ఛైర్మన్ల భేటి
కేంద్ర జలశక్తిశాఖతో ముగిసిన కేఆర్​ఎంబీ, జీఆర్​ఎంబీ ఛైర్మన్ల భేటి

By

Published : Oct 7, 2021, 9:35 PM IST

Updated : Oct 8, 2021, 4:58 AM IST

కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్‌ నోటిఫికేషన్‌ ఈనెల 14 నుంచి అమలులోకి రావాల్సి ఉండడంతో కేంద్రం నేరుగా రంగ ప్రవేశం చేసింది. కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీ గురువారం హైదరాబాద్‌ వచ్చి రెండు బోర్డుల అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. నోటిఫికేషన్‌ ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు ఇప్పటివరకు నిధులు ఇవ్వలేదు. వివరాలు పూర్తిగా సమర్పించలేదు. ఈ నేపథ్యంలో ఏం చేద్దాం, ఎలా చేద్దాం అని ఆమె బోర్డుల ఛైర్మన్లతో కూలంకషంగా చర్చించినట్లు సమాచారం. కొన్ని ప్రాజెక్టులైనా.. ప్రత్యేకించి శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను బోర్డుల ఆధీనంలోకి తీసుకోవడంపై చర్చించినట్లు తెలిసింది. ఉదయం జలసౌధలో కృష్ణా బోర్డు ఛైర్మన్‌ ఎం.పి.సింగ్‌, గోదావరి బోర్డు ఛైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌లతో తొలుత సమావేశమయ్యారు. తర్వాత రెండుబోర్డుల మెంబర్‌ సెక్రటరీలు, సభ్యులు కూడా హాజరయ్యారు. కృష్ణా బోర్డు తరఫున రవికుమార్‌ పిళ్లై, గోదావరి బోర్డు నుంచి పాండేలు గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలుపై ఇప్పటివరకు ఏం జరిగిందో ప్రజంటేషన్‌ ఇచ్చినట్లు తెలిసింది. నోటిఫికేషన్‌లోని రెండో షెడ్యూలులో పేర్కొన్న ప్రాజెక్టుల సిబ్బంది, కార్యాలయాలు, అక్కడున్న యంత్రాలు, వాహనాలు ఇలా మొత్తం వివరాలను రాష్ట్రాలు అందజేయాల్సి ఉండగా అందుబాటులో ఉన్న సమాచారాన్ని సమర్పించారు. ప్రతి బోర్డుకు ఒక్కో రాష్ట్రం రూ.200 కోట్లు సీడ్‌మనీగా ఇవ్వాల్సి ఉంది. ఇంత మొత్తం ఒకేసారి ఇవ్వడం సాధ్యం కాదని రెండూ గత బోర్డు సమావేశంలోనే తేల్చి చెప్పాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బోర్డుల నిర్వహణకు కేటాయించిన నిధులు కూడా ఇప్పటివరకు విడుదల కాలేదు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలన్నదానిపై ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది.

*ప్రాజెక్టుల నిర్వహణలో భాగంగా సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ను నియమించారు. వీరికి జీతభత్యాల కోసం ఏడాదికి సుమారు రూ.150 కోట్లు అవసరం. ఈ విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సానుకూల స్పందన లేదని అధికారులు కేంద్ర అదనపు కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.

*హైదరాబాద్‌లోని కేంద్ర జలసంఘం కార్యాలయం నుంచి 18 మంది అధికారులను మూడు నెలల పాటు బోర్డులకు అటాచ్‌ చేశారు.

12న అత్యవసరంగా సమావేశం

దేవశ్రీముఖర్జీతో భేటీ తర్వాత 12వ తేదీన అత్యవసర సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు కృష్ణా, గోదావరి బోర్డులు రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాయి. నోటిఫికేషన్‌ అమలు, కేంద్రం, రెండు రాష్ట్రాల నుంచి బోర్డులకు డిప్యుటేషన్‌పై వచ్చే ఇంజినీర్లకు ప్రత్యేక ఇన్సెంటివ్‌లు ఇచ్చే అంశాలను అధికారులు ఎజెండాలో చేర్చారు. ఆ అత్యవసర భేటీకి ముందు ఆది, సోమవారాల్లో ఉపసంఘాల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

కృష్ణా బోర్డుకు తెలంగాణ ఈఎన్‌సీ లేఖ

తమ రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల నుంచి తాగు అవసరాలకు తీసుకుంటున్న నీటిలో 20 శాతమే పరిగణనలోకి తీసుకోవాలంటూ తెలంగాణ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌ కృష్ణా బోర్డును కోరారు. ఏపీ ఫిర్యాదు నేపథ్యంలో కృష్ణా బోర్డు ఛైర్మన్‌కు తాజాగా లేఖ రాశారు.

శ్రీశైలం నీటి ఆవిరి నష్టంపై...

ఈనాడు, దిల్లీ: శ్రీశైలంలో నీటి ఆవిరిని 22 టీఎంసీలకే పరిమితం చేయాలని తెలంగాణ తరఫు సాక్షి ఘన్‌ శ్యాం ఝా ట్రైబ్యునల్‌ ఎదుట తెలిపారు. కృష్ణా జలాలపై బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌లో వరుసగా రెండోరోజు గురువారం విచారణ కొనసాగింది. ఏపీ తరఫున సీనియర్‌ న్యాయవాది వెంకటరమణి తెలంగాణ సాక్షిని క్రాస్‌ ఎగ్జామిన్‌ చేశారు. శ్రీశైలం రిజర్వాయరులో 33 టీఎంసీల ఆవిరి నష్టం ఉందని, దాని జోలికి వెళ్లకూడదని ఏపీ న్యాయవాది అనగా నీటి ఆవిరి నష్టం 22 టీఎంసీలకే పరిమితం చేసుకోవాలని ఝా తెలిపారు.

ఇదీ చూడండి:

Badvel by-poll: బద్వేలు ఉపఎన్నిక.. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్

Last Updated : Oct 8, 2021, 4:58 AM IST

ABOUT THE AUTHOR

...view details