కరోనా వ్యాప్తి నివారణకు, ప్రజల్లో రోగ నిరోధకశక్తిని పెంచేందుకు.. హోమియో మందులను మరో విడత అందరికీ అందించాలని కేంద్రాన్ని కోరినట్లు రాష్ట్ర ఆయుష్ కమిషనర్ ఉషాకుమారి తెలిపారు. ఆయుష్ వైద్యులకు విజయవాడ సిద్ధార్ధ ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించిన.. 'కొవిడ్ అనంతర పరిమాణాలు - తీసుకోవాల్సిన జాగ్రత్తలు'పై పునశ్చరణ తరగతుల్లో ఆమె పాల్గొన్నారు. జాతీయ ఆయుష్ మిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి.. ఉషాకుమారి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఏపీలో ఇప్పటికే రెండు లక్షల మందికి పైగా 'ఆర్సినికం ఆల్బమ్ 30'ను ఉచితంగా అందించినట్లు పేర్కొన్నారు. గుడివాడ హోమియో వైద్యశాలలో ఈ మందు వినియోగం గురించి రెండు వేల మందిపై ప్రయోగాలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ ఔషధం తీసుకున్న వారికి కరోనా వైరస్ సోకలేదని గుర్తించామని వివరించారు.
దేశానికి పురాతన కాలం నుంచి సంప్రదాయ ఔషధ చరిత్ర ఉందని.. ఆయుర్వేద రంగంలో దేశం అగ్రగామిగా కొనసాగుతోందని ఉషాకుమారి గుర్తు చేశారు. కరోనా సమయంలో సుగంధ ద్రవ్యాలు, ఇతర నిత్యావసరాలతో తయారు చేసిన హెర్బల్ టీ మంచి ఫలితాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ పానీయం వినియోగంపై ప్రజల్లో మరింత అవగాహన తీసుకొచ్చేందుకు వైద్యులు దృష్టి సారించాలని కోరారు. క్లినికల్ అధ్యయనాలు, ఆయుష్ వ్యవస్థల సహకారంతో మహమ్మారి సమస్యను పరిష్కరించేందుకు.. సంబంధిత మంత్రిత్వ శాఖ కృషి చేస్తోందని స్పష్టం చేశారు. అశ్వగంధ, యష్టిమధు, గుడుచి, పిప్పళ్ళు వంటి 64 రకాల ఔషధ మొక్కలు.. రోగ నిరోధకశక్తి పెంపుదలకు ఉపయోగపడుతున్నాయన్నారు. ఆయుర్వేద, యోగా, నేచురోపతి, యునాని, సిద్ధ, సోవా, రిగ్పా, హోమియోపతిలో ప్రత్యామ్నాయ ఔషధాల వినియోగంపై ఇతర వైద్యులతో చర్చించారు.