Reverse Seniority: రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటులో ముఖ్యమైన ఉద్యోగుల విభజన ప్రక్రియ వేగం పుంజుకుంటోంది. వీటి ఏర్పాటుపై అభ్యంతరాలు, సలహాల స్వీకరణ గడువు ముగిసినందున అధికారులు దీనిపై దృష్టి పెట్టారు. ఆర్థిక శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా, డివిజన్ స్థాయి ఉద్యోగుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. కొత్త జిల్లాలకు తగ్గట్టు ప్రస్తుతమున్న రాష్ట్ర, జోనల్, జిల్లా వ్యవస్థల్లో మార్పు చేసేందుకు రాష్ట్రపతి స్థాయిలో ఆమోదం లభించాల్సి ఉంది. దీనికి సమయం పడుతుంది. ఈలోగా తాత్కాలికంగా ఉద్యోగులను సర్దుబాటు చేస్తున్నారు. శాఖలవారీగా సిబ్బంది సంఖ్యను ప్రకటిస్తూ ఎందరు ఉద్యోగులను ఏయే జిల్లాలకు పంపించాలనేది వచ్చేవారం ఖరారయ్యే అవకాశముంది. ప్రస్తుతమున్న జిల్లా కార్యాలయంలో ఒక హోదాకు సంబంధించి ఎవరు జూనియర్ అయితే వారిని కొత్త జిల్లాకు కేటాయిస్తారు. దీనిని ‘రివర్స్ సీనియారిటీ’గా పేర్కొంటున్నారు. పదోన్నతులకు భిన్నంగా ఈ ప్రక్రియ సాగుతోంది. కొత్తగా పోస్టుల భర్తీ లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. జిల్లా, డివిజన్ కార్యాలయాల్లో పనిచేసేవారిని మాత్రమే ఆర్డర్ టు సర్వ్ ఆధారంగా తాత్కాలికంగా జిల్లాలకు కేటాయించనున్నారు. మండల, గ్రామస్థాయి ఉద్యోగుల విషయంలో మార్పులుండవు. ఉద్యోగుల విభజనకు సంబంధించి వ్యవసాయ శాఖ, మహిళా శిశుసంక్షేమ శాఖలు రూపొందించిన నమూనాకు అనుగుణంగా జిల్లాల్లో ఉద్యోగుల విభజన కసరత్తు చేస్తున్నారు.
జిల్లాలవారీగా పరిశీలిస్తే...!
కొత్త జిల్లాల ఏర్పాటుతో వాటి పరిధి, మండలాల సంఖ్య తగ్గుతుంది. ఈ క్రమంలో జిల్లా జనాభా, ప్రభుత్వసంస్థల సంఖ్యనుబట్టి ఉద్యోగులను సర్దుబాటు చేస్తారు. గుంటూరు జిల్లాలో సుమారు 21 లక్షల మంది, కొత్తగా ప్రకటించిన పల్నాడులో 20.42 లక్షలు, బాపట్ల జిల్లాలో 16 లక్షలమంది ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుత గుంటూరు జిల్లాలో గ్రామ/వార్డు సచివాలయాల్లో పనిచేసేవారు కాకుండా 35వేల మంది ఉద్యోగులు (పోలీసు శాఖతో సహా అన్ని శాఖలు కలిపి) ఉన్నారు. వీరిలో గుంటూరు జిల్లాకు 36%, పల్నాడుకు 25.69%, బాపట్లకు మిగిలినవారిని కేటాయించేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రకాశం జిల్లాలో 236 గ్రామాలతో ఉన్న చీరాల డివిజన్ కొత్తగా ప్రకటించిన బాపట్లలో కలిసింది. దీనివల్ల ఇక్కడి ఉద్యోగులందరూ బాపట్ల జిల్లా పరిధిలోకి వస్తారు. ఈ మేరకు ప్రకాశం జిల్లా వివరాలు గుంటూరు జిల్లాకు అందాల్సి ఉంది. చిత్తూరు జిల్లాలో సుమారు 45వేల మందికిపైగా ఉద్యోగులున్నారు. వీరిలోనుంచి చిత్తూరుకు 50%, కొత్తగా ఏర్పడే బాలాజీ జిల్లాకు 27%, రాయచోటికి 23% మంది ఉద్యోగులను కేటాయించే అవకాశముంది. ఇలా మిగిలిన జిల్లాల్లో ఉద్యోగుల సర్దుబాటు జరగనుంది. కలెక్టర్, జేసీ, ఎస్పీలకు మాత్రమే కొత్త జిల్లాకేంద్రాల్లో ఉచిత వసతి కల్పిస్తున్నారు. కొత్త జిల్లా కలెక్టరే పాత జిల్లాకు ఓఎస్డీగా వ్యవహరిస్తారు. గుంటూరు జిల్లాలో కొత్తగా వచ్చే 2జిల్లాలకు అనుగుణంగా రెండు చొప్పున ఆర్డీవో, డీఆర్వో పోస్టులు వస్తాయి. డిప్యూటీ కలెక్టర్ హోదాల్లో వేర్వేరు చోట్ల పనిచేసే వారితో ఈ పోస్టులను నింపుతారు. ఇలా కొత్త జిల్లాల్లో అదనంగా పోస్టులు రానున్నాయి.